Monday, March 23, 2026
HomeCrimeఫోన్‌లో భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాన్‌

ఫోన్‌లో భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాన్‌

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: పావని ఏమి చేస్తున్నారు.. భోజనం చేశారా.. పిల్లలు తిన్నారా.. నాన్న ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది.

బాగా చూసుకోవాలి.. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. అందమైన ఇల్లు కట్టుకుందాం.. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేద్దాం.. ఇప్పటికే రూ.34 లక్షలు అప్పు చేశా.. నువ్వు మన కుటుంబానికి అండగా ఉండి బాగా చూసుకోవాలి..అంటూ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ కంచుకుంట మురళి.. తన భార్యకు ఆదివారం రాత్రి 10 గంటలకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈక్రమంలో కాసేపటికే ఇక సెలవు అంటూ తన చేతిలోని తుపాకీతో కాల్చుకున్నాడు. భార్య హలో.. హలో ఏమండీ అంటున్నా స్పందనలేదు. అక్కడ సమీపాన ఉన్న తోటి జవాన్‌ శబ్దం విని వచ్చి చూడగా అప్పటికే నేలకొరిగాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌- రాయ్‌పూర్‌లోని 65వ బెటాలియన్‌లో చోటుచేసుకుంది.

శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం శివపురంకొట్టాలకు చెందిన ముత్యాలన్న, నాగలక్ష్మీ దంపతులకు కుమారుడు కంచుకుంట మురళి (30) సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా 2017లో ఎంపికయ్యారు. ఆయన అనంతపురం నగరానికి చెందిన లోకపావనిని ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి నాలుగేళ్ల కుమారుడు తారక్‌రామ్, రెండేళ్ల కుమార్తె మహి ఉన్నారు.

తండ్రి వైద్యానికి అప్పు చేసి…

మురళి తండ్రి ముత్యాలన్నకు చర్మసంబంధ క్యాన్సర్‌ సోకడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సుమారు రూ.30 లక్షల వరకు అప్పు చేశారు. తన సోదరికి పెళ్లి చేయాల్సి ఉంది. మరోవైపు నాలుగు నెలల కిందట మురళి కారును మిత్రుడు తీసుకెళ్తుండగా పెనుకొండ సమీపంలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. కారు నంబరు ఆధారంగా మురళిని.. కేసు రాజీ అయ్యేందుకు మృతుడి కుటుంబసభ్యులు రూ.15 లక్షలు డిమాండ్‌ చేశారు. తండ్రి వైద్యం కోసం దాచుకున్న రూ.4 లక్షలను ముట్టజెప్పారు. ఇలా.. మొత్తం రూ.34 లక్షల దాకా అప్పు చేశారు. తండ్రి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో 15 రోజుల కిందట బెంగళూరుకు వచ్చిన మురళి.. తిరిగి బెటాలియన్‌కు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల వర్గాలు పేర్కొన్నాయి. నేడు శివపురంకొట్టాలలో జవాన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page