![]()
బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగం
హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్ బ్యూరో
బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఒక్కో ప్రాజెక్టుపై సమీక్ష చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ, ఇతర సాగునీటి ప్రాజెక్టు పనుల వేగవంతంపై చర్చించాం. అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్లో జరిగినట్లుగానే ఇందులోనూ భారీ కుంభకోణం జరిగింది. ప్రాజెక్టుల పేరిట భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగింది.
ఈ ప్రాజెక్టు గతంలో రాజీవ్ దుమ్ముగూడ, ఇందిరా సాగర్ అని రెండు వేర్వేరుగా ఉండేవి. ఆ రెండింటినీ ఏ విధంగా ఒక్కటి చేసి సీతారామ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారో తెలియడం లేదు. దీనిపై వేల కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ సైతం సీతారామ ప్రాజెక్టుపై అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి మరో రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్లు ఖర్చే చేసి ఉంటే దుమ్ముగూడ, ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఏడాదిలో పూర్తయ్యేవి. 3,32,000 ఎకరాలకు నీరు వచ్చేది. పదేళ్లు దాటింది. మరో రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు. ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. సీతారామ ప్రాజెక్టు వ్యయం పెంచి రూ.18వేల కోట్లకు తీసుకొచ్చారు’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు.


