![]()
మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: ముంబయి వాంఖడే స్టేడియంలోని బీసీసీఐ కార్యాలయం నుంచి 6.5 లక్షల రూపాయల విలువైన ఐపీఎల్ 2025 జెర్సీలు చోరీకి గురయ్యాయి.
నిందితుడైన సెక్యూరిటీగార్డు ఫరూఖ్ అస్లాం ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అతడు దాదాపు 261 జెర్సీలను దొంగిలించినట్లు తెలుస్తోంది. ఒక్కోదాని ఖరీదు సుమారు 2,500 రూపాయలు ఉంటుందని అంచనా.ఆన్లైన్ జూదానికి బానిసైన సెక్యూరిటీగార్డు ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే జెర్సీలు వేరు వేరు జట్లకు చెందినవి అయినప్పటికీ, అవి ఆటగాళ్ల కోసమా.. లేక అభిమానుల కోసమా అనేది కచ్చితంగా తెలియదు. ఆ సెక్యూరిటీ గార్డు తాను దొంగిలించిన జెర్సీలను హరియాణాకు చెందిన ఆన్లైన్ డీలర్‌కు విక్రయించాడు. ఈ డీల్ కోసం నిందితుడు, అతణ్ని సోషల్ మీడియా ద్వారా సంప్రదించాడు.
ఈ దొంగతనం జూన్ 13న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగు చూసింది. స్టోర్‌రూమ్‌లో స్టాక్ మిస్సయినట్లుగా ఆడిట్లో తేలడంతో ఈ చోరీ ఉదంతం బయటకు వచ్చింది. బీసీసీఐ అధికారులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, ఆ సెక్యూరిటీ గార్డు జెర్సీలను ఒక పెట్టెలో పెట్టుకొని వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ జెర్సీలను తాను కొరియర్ ద్వారా ఆన్లైన్ డీలర్‌కు పంపినట్లు నిందితుడు తెలిపాడు. అయితే ఎంత మొత్తానికి అమ్మింది ఇంకా తెలియాల్సి ఉంది.
సెక్యూరిటీ గార్డు నుంచి జెర్సీలను కొనుగోలు చేసిన డీలర్‌ను విచారణ కోసం పోలీసులు హరియాణా నుంచి పిలిపించారు. అయితే జెర్సీలు దొంగిలించిన విషయం తనకు తెలియదని డీలర్ పోలీసులకు తెలిపాడు. ‘కార్యాలయంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల కారణంగా, స్టాక్ క్లియరెన్స్‌లో భాగంగా జెర్సీలు అమ్మకానికి ఉన్నాయని గార్డు తనకు చెప్పాడు’ అని ఆన్లైన్ డీలర్ పోలీసుల విచారణలో వాపోయాడు.
చోరీకి గురైన వాటిలో 50 జెర్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీలర్ నుంచి నేరుగా తన బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చాయని నిందితుడు తెలిపాడు. అయితే ఆన్లైన్ బెట్టింగ్‌లో ఆ మొత్తాన్నీ పోగొట్టుకున్నానని అతడు తెలిపాడు. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు బ్యాంక్ ఖాతాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే.. జెర్సీలు మిస్సయిన విషయమై జులై 17న బీసీసీఐ అధికారులు మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


