![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అస్థిరత నెలకొంది. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- ఇరాన్, ఇజ్రాయెల్- గాజా, యెమెన్- సిరియా, చైనా- తైవాన్, పాకిస్థాన్- బలూచిస్థాన్..
ఇలా సరిహద్దు దేశాలు నువ్వా నేనా అన్నట్లు దాడులు చేసుకుంటున్నాయి. ఇక భారత్ కు పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకుంటోంది. ఈ క్రమంలో భారత అమ్ముల పొదిలోకి మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది.
భారత సైన్యం చేతికి త్వరలో అత్యంత శక్తివంతమైన ఏకే-203 రైఫిల్స్ చేరనున్నాయి. ఈ మేరకు తొలి బ్యాచ్ ఆయుధాలను భారత్ కు ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇండో- రష్యన్ రైఫిల్స్ లిమిటెడ్ సంయుక్తంగా అమేథీలో వీటి నిర్మాణం చేపట్టాయి. ఈ మేరకు భారత్- రష్యా మధ్య రూ. 5,200 కోట్ల ఒప్పందాలు జరిగాయి. డీల్ లో భాగంగా ఇప్పటికే 48 వేల ఏకే- 203 రైఫిల్స్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.
గతంలో పేరొందిన కళాష్నికోవ్ సిరీస్ ను మరింతగా అప్డేట్ చేసి వీటిని తయారు చేశారు. ఈ రైఫిల్స్ నిమిషానికి 700 రౌండ్ల బుల్లెట్స్ తో దాడి చేయగలవు. వీటి రేంజ్ 800 మీటర్ల వరకు ఉంటుంది. ఈ రైఫిల్ కు షేర్ అని నామకరణం చేశారు. ది ఇండో- రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంయుక్తంగా ఈ రైఫిల్స్ ను ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో తయారు చేస్తోంది.
ఈ మేరకు ఇరు సంస్థల మధ్య రూ.5,200 కోట్ల ఒప్పందం జరిగినట్లు మేజర్ జనరల్ ఎస్ కే శర్మ పేర్కొన్నారు. డిసెంబర్ 2030 నాటికి 6 లక్షలకు పైగా ఏకే- 203 రైఫిల్స్ అందించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 48 వేల రైఫిళ్లను ఇచ్చేశామని, మరో మూడు వారాల్లోగా మరో 7 వేల రైఫిళ్లు అందజేస్తామని, డిసెంబరు నాటికి 15 వేల రైఫిళ్లు అదనంగా అందజేయడానికి సిద్దంగా ఉన్నామని శర్మ తెలిపారు.
ఇక ఈ ఏకే- 203 రైఫిల్స్ బరువు 3.8 కేజీలు ఉంటుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఏకే-47, ఏకే-57 రైఫిల్స్ బరువు 4.15 కేజీలు ఉంటుంది. అంటే వాటితో పోల్చితే బరువు తక్కువే. కాగా పొడవు కూడా తక్కువగానే 705 ఎంఎం మాత్రమే ఉంది. ఈ రైఫిల్స్ ను పాకిస్థాన్, చైనా దేశాల సరిహద్దు, నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంట గస్తీ నిర్వహిస్తున్న సైనికుల చేతికి అందించాలని కేంద్ర రక్షణ మంత్రత్వ శాఖ భావిస్తోంది.


