![]()
మన భద్రాద్రి ఎడ్యుకేషన్ న్యూస్: ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు పోటీ పరీక్షలకు సిద్దం అయ్యేందుకు వీలుగా పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసారు. గతం కంటే ముందుగానే పరీక్షల నిర్వహణకు నిర్ణయించారు. ఇక.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రాక్టికల్స్ నిర్వహణ పై కీలక నిర్ణయం జరిగింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. గత ఏడాది మార్చి5న మొదలైన పరీక్షలు 25న ముగిశాయి. అయితే ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జనవరి ఆఖర్లో ప్రారంభించి ఫిబ్రవరి మొదటివారంలో పూర్తి చేయనున్నారు. ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో నిర్వహించనున్నారు. పరీక్షలు ముందుగా నిర్వహిస్తే సెకండియర్ విద్యార్థులు ఎప్‌సెట్, ఐఐటీలాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేందుకు మరింత సమయం లభించనుంది.
ఇక, ఈసారి ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో విద్యార్థికి రూ.30 చొప్పున వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈసారి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థి నుంచి రికగ్నిషన్ ఫీజు రూ.220, గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున వసూలు చేయాలని ఇంటర్ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీచేశారు. కాగా.. ఇప్పటి వరకు కేవలం రెండో సంవత్సరంలోనే ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తుండగా..వచ్చే సంవత్సరం ఫస్టియర్ విద్యార్థులకూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ మేరకు ఇంటర్ సంస్కరణలకు సీఎం రేవంత్ అంగీకారం తెలిపారు. ఇక నుంచి సంస్కృతం, తెలుగు, గణితం తదితర అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు ఇచ్చేలా నిర్ణయించారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకూ అంతర్గత మార్కులు ఉంటాయి. ఇంటర్మీడియట్లో నూతనంగా ఏసీఈ అనే గ్రూపును ప్రవేశపెట్టనున్నారు. దీనిలో ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో కొత్త గ్రూపును అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మార్పులకు రంగం సిద్దమైంది.


