![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల సరిహద్దులో భీకర ఎన్కౌంటర్ జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొండమొదలు, చింతకూరు, కొయ్యలగూడెం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు అగ్ర నేతలు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అల్లూరి జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్ (Greyhounds) సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుపడగా.. ఇరువర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి (Gajarla Ravi) అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ (Uday), మావోయిస్టు ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ మెంబర్, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత చలపతి భార్య అరుణ (Aruna) తీవ్రమైన బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమెపై రూ.20 లక్షల రివార్డు కూడా ఉంది. అదేవిధంగా ఈ కాల్పుల్లో మరో దళ సభ్యుడు అంజు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మూడు AK-47 రైఫిళ్లతో పాటు భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించనున్నారు.
ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో శాంతి చర్చలకు..
కాగా, గాజర్ల రవి అలియాస్ గణేశ్ స్వస్థలం భూపాలపల్లి (Bhupalapally) జిల్లా వెలిశాల (Vealishala). ఆయన సోదరులు ఆజాద్ అలియాస్ గాజర్ల సారయ్య, ఐతు అలియాస్ గాజర్ల అశోక్ లు కూడా మావోయిస్టు పార్టీలో పని చేశారు. ఆజాద్ గతంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందగా.. మరో సోదరుడు అశోక్ కొన్నేళ్ల క్రితం పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004, అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరఫున ప్రతినిధిగా తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ పాల్గొన్నారు. ఆ శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో రవి కీలక పాత్ర పోషించారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది.


