![]()
-పాఠశాల స్థితిగతులను చూసి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు
-శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం
-ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థుల, అధ్యాపకుల భయాందోళన
ఏడూళ్ళ బయ్యారం, మన భద్రాద్రి న్యూస్, జులై 02
పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని బీసీ రాయిగూడెం ప్రాథమిక పాఠశాల పరిస్థితి అధికారుల నిర్లక్ష్యంతో రోజురోజుకీ దయనీయంగా మారుతుంది. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని విద్యార్థులు, అధ్యాపకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చినుకు పడితే చాలు అడుగుమేరకు నీరు నిలిచి, మురుగు నీరు పాఠశాల ఆవరణలో నిలిచి మురుగు కాల్వను తలపిస్తుంది. విద్యార్థులు తమ తరగతి గదిలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. పాఠశాల పరిస్థితిని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు చేసేదేమీ లేక తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఈ కారణంగా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. భారీ వర్షం పడి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితులలో ఉన్న విద్యార్థులు తమ చదువులను భయం భయంగా, ఆందోళనతో అలాగే కొనసాగిస్తున్నారు. ఇకనైనా మండల విద్యాశాఖధికారి, ఉన్నత అధికారులు వెంటనే స్పందించి రాయిగూడెం ప్రాథమిక పాఠశాల పరిస్థితిని చక్కదిద్ది, విద్యార్థుల సంఖ్యను పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధ్యాపకులు, అక్కడ చదివే విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖాధికారి వివరణ
ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలేబోయిన రవికుమార్ ను ” మన భద్రాద్రి న్యూస్ “ వివరణ కోరగా నూతన భవనం నిర్మాణంకై పలుమార్లు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశామని తెలిపారు. పాఠశాల వసతులు సక్రమంగా లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఎవరు కూడా మా పాఠశాలలో పిల్లలను చదివించుటకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఇదే విషయంపై మండల విద్యాశాఖాధికారి వీరస్వామిని వివరణ కోరగా తొందరలోనే నూతన భవనాలు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ పాఠశాలకు కొత్త భవనాన్ని మంజూరు చేపిస్తానని అన్నారు.


