![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్
మండల కేంద్రంలో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి లు పాల్గొని మాట్లాడుతూ ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రెండు సంఘాలు జనవరి 22 న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో విలీనమవుతున్నాయని, ఈ సభకు యువకులు అధిక సంఖ్యలో హాజరై ఈ ఐక్యత సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోధీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఫాసిజం పేరుతో దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్స్, ఆదివాసీలపైన దాడులు ఎక్కువయ్యాయని, ముఖ్యంగా మధ్య భారతంలో ఆదివాసీలను అడవుల నుండి వెళ్లగొట్టి, ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న ఖనిజాలను, అడవులను కార్పోరేట్ కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, వీటిని ఎదిరించిన ఆదివాసీలను అనేకమందిని ఎన్కౌంటర్ పేరుతో హాత్యగావించారని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోధీ వాగ్దానం చేశారని, ఈ వాగ్దానాన్ని అమలు చేయక పోగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బజార్ కి ఈడ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) జిల్లా అధ్యక్షులు చింత నరసింహారావు, జిల్లా సహాయ కార్యదర్శి నోముల భాను చందర్, వాంకుడోత్ మోతిలాల్, ఉపేందర్, అటికం శేఖర్, తాటి రమేష్, ఎనగంటి లాజర్, కల్తి ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.


