Monday, March 23, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemరీల్స్ చేసుకుంటున్న విద్యార్థులతో పోలీసులమంటూ బెదిరించి డబ్బు కోసం దాడి

రీల్స్ చేసుకుంటున్న విద్యార్థులతో పోలీసులమంటూ బెదిరించి డబ్బు కోసం దాడి

Loading

-నలుగురిని అరెస్టు చేసిన కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు

కొత్తగూడెం, మన భద్రాద్రి జిల్లా స్టాఫర్, ఆగస్టు 07

నేషనల్ హైవే పక్కన రీల్స్ షూటింగ్ చేసుకుంటున్న విద్యార్థులను, పోలీసులమంటూ బెదిరించి డబ్బులు గుంజుదామని చూసిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కొత్తగూడెం టూ టౌన్ సీఐ రమేష్ మీడియాకు ఆ కేసు వివరాలు వెల్లడించారు. సీఐ రమేష్ వివరాల ప్రకారం కొత్తగూడెంకు చెందిన విద్యార్థులు ఆకాష్, తరుణ్, జస్వంత్ రాజు ఆగస్టు 4 న సాయంత్ర సమయంలో రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ జంక్షన్ దగ్గరలోని నేషనల్ హైవే వద్ద రీల్స్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో వారిని చూసిన పెనగడప గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో వస్తూ తాము పోలీసులమంటూ చెప్పి వారిని బెదిరించారు. ఇక్కడెందుకు ఫోటోలు దిగుతున్నారంటూ ప్రశ్నిస్తూనే, మీరు గంజాయి బ్యాచ్ అంటూ వారి ఫోటోలు తీశారు. పోలీసులమంటూ బెదిరించి, వారిని డబ్బుల గురించి భయపెట్టారు. వారిని బెదిరిస్తూ, తీసిన ఆ ఫోటోలను డిలీట్ చేయడానికి డబ్బులివ్వాలని అడిగారు. వారిని ఐడీ కార్డు చూపించాలని ఆ విద్యార్థులు అడగడంతో, కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు మమ్మల్నే ఐడీ కార్డు అడుగుతారా? అంటూ వారిని కొట్టారు. తమపై ఆగంతకులు దాడి చేస్తుండగానే ముగ్గురు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనపై విద్యార్థులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తమ దర్యాప్తులో నిందితులైన ఆ నలుగురు పెనగడప గ్రామానికి చెందిన ఎస్కే యాకూబ్ గౌరీ, ఎగ్గడి అశోక్, వడ్డే మనోజ్, పులిచర్ల శరత్ చంద్రాలుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, విచారించి వారి వద్ద నుంచి కారు, ఫొటోలు తీసిన సెల్ ఫోన్ ను స్వాధీనపరచుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు, ఇతర వ్యక్తులు గానీ నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లి ఫోటోషూట్స్, రీల్స్ లాంటివి తీసుకోవడం చేయవద్దని ఈ సందర్భంగా సీఐ రమేష్ సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నందున ఎవరూ కూడా రోడ్లమీద, నిర్మాణంలో ఉన్న ప్రదేశాలతోపాటు, ప్రమాదకరమైన వాగులు, నదులు, చెరువుల వద్దకు వెళ్లి ఫోటోలు దిగడం, రీల్స్ చేయడం వంటివి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page