![]()
ఫిబ్రవరి 1వ తేదీన రైతులకు శుభవార్త అందే అవకాశం ఉంది. ఆ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి వ్యవసాయ రంగానికి సంబంధించి నిధులు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
2022-23 లో 4 శాతం గ్రోత్ నమోదు చేసిన రూరల్ ఎకానమీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం తగ్గేటట్టు (డీగ్రోత్) కనిపిస్తోంది. దీంతో ఈ సెక్టార్‌పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పీఎం కిసాన్(PM Kisan) యోజన కింద ఇచ్చే సాయాన్ని పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేల వరకు ఇస్తున్న సాయన్నీ రూ.8 వేలకు పెంచే అవకాశం ఉంది. ఆ దిశగానే బడ్జెట్ రోజు ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా 16వ విడత నిధులను ఫిబ్రవరి గానీ, మార్చిలో గానీ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే త్వరలో దేశంలో సర్వత్రిక ఎన్నికలున్న నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే ఆర్థకం సాయం పెరిగే అవకాశం ఉన్నట్లు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
నరేంద్ర మోడీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం రైతులకు సాయం చేసేందుకు 2019లో పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రూ. 2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో 15 సార్లు పీఎం కిసాన్ యోజన నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కోక్క రైతు ఖాతాలో రూ.30 వేలు జమ చేశారు. పెరిగిన ఎరువులు, కూలీల ఖర్చులు పరిగణలోకి తీసుకని పీఎం కిసాన్ యోజన ఆర్థక సాయాన్ని పెంచాలని అన్నదాతలు కోరుతున్నారు.
దేశంలో ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలోనే మధ్యంతర బడ్జెట్‌లో కీలక ప్రకటనలు, నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ వంటి పథకాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.


