![]()
-రేగా కాంతారావు ఎద్దేవా
గుండాల, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 08
మండల కేంద్రంలో శనివారం మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు మాసాలు గడిచినా వారిచ్చిన హామీలు మాత్రం అమలుకు నోచుకోలేదని, హామీ పత్రం ఇంటింటికి ఇచ్చి, అమలు మాత్రం ఒకే గ్రామానికి చేస్తారా అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పథకాలు అమలుకు నోచుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్పా కొత్తగా నియోజకవర్గానికి ఒక్క పైసా మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో కోత విధించడమే తప్పా కొత్తగా వీరు సాధించింది ఏమీలేదని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, రాష్ట్ర ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇచ్చిన హామీల మాట దేవుడు ఎరుగు కానీ గతంలో అమలైన పథకాలనైనా అమలు చేయాలని, రైతుబంధు, రైతు రుణమాఫీ ఏ ఒక్క గ్రామంలోనైనా పూర్తిస్థాయిలో అమలు అయిందని నిరూపించే దమ్ము ఉందా అని సవాలు విసిరారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిగా కుంటుపడిందని, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే అది ఒక్క కేసీఆర్ వల్లనే సాధ్యమని అన్నారు. గ్రామ సభల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారే తప్పా వాటితో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. ఎన్నికల కోసమే బూటకపు హామీలు ఇచ్చారని, అమలు చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రతీ కార్యకర్త సైనికునిలా పని చేయాలని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, ఉపాధ్యక్షులు అటికం నాగేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి టి రాము, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్టా రాములు, పార్టీ సీనియర్ నాయకులు వట్టం రవి, గడ్డం వీరన్న, గుగ్గిల రాంబాబు, జాడి ప్రభాకర్, పొంబోయిన సుధాకర్, తాటి కృష్ణ, బొమ్మెర శ్రీను, లక్ష్మీనరసు, మల్లయ్య, భూక్య శ్రీను, పద్మారావు, మహేందర్, లక్ష్మయ్య, బొమ్మెర్ల సతీష్, వీరు, సీహెచ్ వీరన్న, వెంకన్న, కాలే, హరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


