Monday, March 23, 2026
HomeAndhra Pradeshవాహనం మారినా వదలని మృత్యువు

వాహనం మారినా వదలని మృత్యువు

Loading

  • రోడ్డుప్రమాదంలో ఇద్దరు ఏపీ డీఎస్పీల మృతి

హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: పోలీసు ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్‌ అయ్యింది. డ్రైవర్‌ చాకచక్యంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డారు. మరో వాహనం తెప్పించుకొని తిరిగి ప్రయాణం మొదలుపెట్టగా మళ్లీ ఎదురొచ్చిన మృత్యువును ఈసారి తప్పించుకోలేకపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతిచెందగా మరో అదనపు ఎస్పీ, ఓ హెడ్‌కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, వీవీఐపీ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ కేడీఎంవీఆర్‌ ప్రసాద్‌(56), ఇంటెలిజెన్స్‌ డీఎస్పీలు జల్లు శాంతారావు(56), మాకా చక్రధరరావు(52) శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు విధుల్లో భాగంగా పోలీసుశాఖకు చెందిన వాహనంలో బయలుదేరారు.

అర్ధరాత్రి సమయంలో కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా సమీపంలోకి చేరుకోగానే వీరి వాహనం బ్రేక్‌డౌన్‌ అయ్యింది. దీంతో హైదరాబాద్‌లోని ఏపీ పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయానికి సమాచారం అందించగా.. అక్కడి నుంచి హెడ్‌కానిస్టేబుల్‌ రెడ్డిచర్ల నర్సింహరాజు(54) స్కార్పియో వాహనం తీసుకొచ్చారు. దాంట్లో ముగ్గురు ఉన్నతాధికారులను ఎక్కించుకొని హైదరాబాద్‌కు బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున 4:45 నిమిషాలకు కైతాపురం వద్దకు రాగానే ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో డ్రైవర్‌ నర్సింహరాజు దాన్ని తప్పించబోయి డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో వాహనం ఎగిరి అవతలి వైపు విజయవాడ మార్గంలో పడింది.

అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న సిమెంటు లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాంతారావు, చక్రధరరావు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రసాద్, నర్సింహరాజు తీవ్రంగా గాయపడగా మొదట చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి, అనంతరం హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. శాంతారావు కుమారుడు బాలగంగాధర్‌ తిలక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మన్మథకుమార్‌ తెలిపారు.

  • ఒకరిది శ్రీకాకుళం.. మరొకరిది పాలకొల్లు..

మృతిచెందిన డీఎస్పీ శాంతారావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం డోలా గ్రామం కాగా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో డీఎస్పీ చక్రధరరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కాగా భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదనపు ఎస్పీ ప్రసాద్‌ స్వస్థలం రాజమహేంద్రవరం, డ్రైవర్‌ నర్సింహరాజుది అన్నమయ్య జిల్లా రాజంపేట. వీరు హైదరాబాద్‌లోని ఏపీ పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో పని చేస్తుండటంతో ఇక్కడే కుటుంబంతో నివాసం ఉంటున్నారు. క్షతగాత్రులు ప్రసాద్‌ ఇక్కడి హైదర్షాకోట్‌లో, నర్సింహరాజు బొల్లారంలో ఉంటున్నట్లు తెలిసింది.

  • డీఎస్పీల మృతి బాధాకరం: హోం మంత్రి అనిత

రోడ్డు ప్రమాదంలో డీఎస్పీలు చనిపోవడం బాధాకరమని హోం మంత్రి అనిత అన్నారు. చక్రధరరావు, శాంతారావు మృతదేహాలను రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా వారి స్వస్థలాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో గొల్లపూడి వ్యవసాయ మార్కెట్‌ వద్దకు రాగానే.. హోంమంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చిన హోంమంత్రి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page