![]()
సింగరేణి లాభాలను ప్రకటించాలి
- బోనసు 35 శాతం చెల్లించాలి
- ఎల్లో, రెడ్ కార్డులు రద్దు చేయాలి
- జిఎల్ బికేస్ డిమాండ్
ఇల్లందు, మన భద్రాద్రి బ్యూరో
సింగరేణిలో 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన లాభాలను గత 5 నెలలుగా ప్రకటించకుండా ఆలస్యం చేస్తున్నారని, వెంటనే వచ్చిన లాభాలను ప్రకటించి కార్మికులకు 35 శాతం బోనసుగా చెల్లించాలని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (ఇఫ్టూ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బయ్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపె ట్టిన రెడ్, ఎల్లో కార్డులను రద్దు చేయాలని, అన్ని విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కు కూడా 10 శాతం లాభాల బోనసు వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిఎల్ బికేఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇల్లందు ఏరియాలో జిఎం (పర్సనల్) మోహన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించాలని, రక్షణ చర్యలు విస్మరించి ప్రమాదానికి కార్మికులను కారకులుగా పేర్కొంటూ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన రెడ్, ఎల్లో కార్డులను రద్దు చేయాలని, బొగ్గు గనుల అమ్మకాలను అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలకు గురైన కార్మికులకు సకాలంలో వైద్యం చేయించడానికి తగిన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, సత్వర వైద్యం అందించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ సీనియర్ రాష్ట్ర కోశాధికారి కొండపల్లి శ్రీనివాసు, నాయకులు ఏ.మహేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.


