![]()
- వివేకా హత్య కేసులో తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపణ అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని డిమాండ్
అమరావతి, మన భద్రాద్రి వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె.శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు.
వివేకా హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జి.ధరణేశ్వరరెడ్డి ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపారు. అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తన ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
- ఎవరీ శంకరయ్య..?
2019 మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జె.శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని, రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 2019లోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ‘వివేకా హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నన్ను బెదిరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించొద్దని, మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికీ చెప్పొద్దని నన్ను భయపెట్టారు’ అని శంకరయ్య తొలుత సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. అయితే మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తనకు వేరే పనులున్నాయంటూ దాటవేశారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే (2021 అక్టోబరు 6న) ఆయనపై సస్పెన్షన్‌ను నాటి వైకాపా ప్రభుత్వం ఎత్తేసింది. నిందితులు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చారని సీబీఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులివ్వటం చర్చనీయాంశంగా మారింది. శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్లో వీఆర్‌లో ఉన్నారు.


