![]()
-పోలీస్ శాఖపై ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం..
-ఇల్లందు పోలీస్ స్టేషన్ లో మహిళలకు న్యాయం జరిగేనా
-ఒక మంచి ఆఫీసర్ ను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటున్న ప్రజలు
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, జూన్ 26
పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో సదరు మహిళ భర్తకు (ఎన్ఆర్ఐ) ఫోన్ చేసిన ఆరోపణలలో ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేయడాన్ని ఇల్లందులోని పలు మహిళా సంఘాలు, నాయకులు, ప్రజలు, పలు రాజకీయ పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. న్యాయం కోసం వచ్చిన మహిళకు న్యాయం చేయాలని కిందిస్థాయి సిబ్బందికి చెప్పాల్సిన ఉన్నతాధికారులే న్యాయం కోసం తన విధులు నిర్వహిస్తున్న అధికారిని సస్పెండ్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని మహిళా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. న్యాయం కోసం వచ్చిన వివాహితతో పాటు తన కుటుంబీకులు, బంధువుల ఫిర్యాదును స్వీకరించిన సీఐ బత్తుల సత్యనారాయణ ఆ ఫిర్యాదులో భాగంగానే సదరు మహిళా భర్తకు ఫోన్ చేసి ఇల్లందు పోలీస్ స్టేషన్ కు రావాలంటూ చెప్పడం జరిగిందని బాధితురాలు మీడియాకు తెలిపారు. భార్యాభర్తలను కలిపేందుకే సీఐ ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ చేశారు. మహిళ భర్త మాత్రం ఇల్లందు పోలీస్ స్టేషన్ గుమ్మంలో అడుగు పెట్టలేదు. ఇది ఇలా ఉండగా అనతి కాలంలోనే ఇల్లందులో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేసి, ఇల్లందు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీఐ ఎవరంటే సీఐ బత్తుల సత్యనారాయణ చెప్పుకోవచ్చు. సీఐ బత్తుల సత్యనారాయణ ఇల్లందుకు వచ్చిన తర్వాత గంజాయి సేవించిన యువకుల అల్లర్లకు కళ్లెం వేయడంతో పాటు చోరీల నియంత్రణ, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం పట్ల సీఐ చూపిన పనితీరును ఇల్లందు ప్రజలు అభినందించారు. ఇల్లందుకు సరైనోడు సీఐ సత్యనారాయణ అంటూ ప్రజలు ప్రశంసా జల్లులు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేయడం పట్ల కొన్ని మీడియా సంఘాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీఐ సస్పెన్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఇదేమిటి ఒక ఆడపడుచు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే ఆ మహిళకు న్యాయం చేసేందుకు విధుల్లో భాగంగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్న అధికారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీఐగా ఇల్లందుకు వచ్చిన సత్యనారాయణ అనతి కాలంలోనే ప్రజల్లో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇదే క్రమంలో సీఐ సత్యనారాయణను సస్పెన్షన్ చేయడంతో పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని పలువురు గుసగుసలాడుతున్నారు.


