Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudem1/70 చట్టానికి విరుద్ధంగా భూమి కొనుగోలు చేసిన గిరిజనేతరునిపై ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలి

1/70 చట్టానికి విరుద్ధంగా భూమి కొనుగోలు చేసిన గిరిజనేతరునిపై ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలి

Loading

-చట్ట ఉల్లంఘనకు పాల్పడిన విద్యుత్ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలి

-ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు మల్లు దొర డిమాండ్

దుమ్ముగూడెం, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 26

నడికుడి రెవిన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 81 లో వ్యవసాయ భూమిని 1/70 చట్టానికి విరుద్ధంగా కొనుగోలు చేసి, ఆ భూమిలో ప్రైవేటు వ్యాపార సంస్థ ఏర్పాటు కోసం నిర్మాణాలు చేపడుతున్న మండలంలోని లక్ష్మీనగరం గ్రామానికి చెందిన గిరిజనేతరుడిపై వెంటనే రెవిన్యూ అధికారులు ఎల్టీఆర్ కేసు నమోదు చేయాలని, ఏజెన్సీ చట్టం 1/70 పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన గిరిజనేతరడికి, ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు సోంది మల్లు దొర ప్రభుత్వ ఉన్నత ఆధికారులను డిమాండ్ చేశారు. బుధవారం నడికుడి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 81 లో అక్రమంగా బోర్ వేసిన, ఏజెన్సీ చట్టానికి విరుద్ధంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని మండల అధ్యక్షులు కుర్సం రవి ఆధ్వర్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుమ్మగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో 1/59, 1/70 చట్టాలకు విరుద్ధంగా కాసులకు కక్కుర్తి పడి పలు శాఖల అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ, తాము ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కడమే కాక ఏజెన్సీ చట్టాలను కాలరాయడానికి గిరిజనేతరులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపయోగపడుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర్ల నుండి గానీ, గిరిజనుల నుండి గానీ భూమిని కొనుగోలు చేస్తే ఎలా చెల్లుబాటు అవ్వదనే విషయం కూడా విద్యుత్ శాఖ అధికారులకు తెలియదా..?, ఏజెన్సీ చట్టాలు తెలియకుండానే ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నారా.? అని ఆయన ప్రశ్నించారు. మండలంలో జరిగిన పరిస్థితులు చూస్తుంటే 1/70 చట్టానికి, ఏజెన్సీ చట్టాలకు కంచె చేను మేసిన చందంగా ఏజెన్సీ చట్టాలను పగడ్బందీగా అమలు చేసి కాపాడవలసిన అధికారులే ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడవడంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు ముందుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో తాతల, తండ్రుల కాలం నుండి భూమి పట్టాలు పొంది ఉన్న ఆదివాసీ గిరిజనులు, వృద్ధులు అనేక కారణాలతో చనిపోయిన సందర్భంలో వారి వారసులకు పట్టదారు పాసు పుస్తకాలు మార్చడానికి మాత్రం ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవు గానీ, 1/70 చట్టం అమలులో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో ఓ గిరిజనేతరుడు మరో గిరిజనేతరుడి వద్ద గానీ, గిరిజనుడు వద్ద గాని భూమి కొన్నా, గిరిజనేతరులు, గిరిజనుల భూమిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా, ఆ భూముల్లో భారీ భవంతులు నిర్మించుకున్నా, వాటికి మాత్రం ప్రభుత్వ అధికారులు ఎలా అనుమతులిస్తున్నారని ప్రశ్నించారు. అక్రమంగా చట్టాలకి విరుద్ధంగా అర్హత లేని వారికి అనుమతినిస్తున్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా చట్టాలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు తహసీల్దార్, విద్యుత్ శాఖ కార్యాలయాలను ముట్టడి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికైనా వివిధ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు ఏజెన్సీ చట్టాలకు లోబడి విధులు నిర్వహించకపోతే స్థానిక అధికారులపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారం గోపాలరావు, కూరం బొర్రయ, కోరం మురళి, కొరస రామచంద్రయ్య, కోర్స గంగరాజు, ఆపక వెంకటేష్, తుర్రం నరసింహారావు, నాగేశ్వరావు, గ్రామస్థులు సీతమ్మ పోడియం జయ, కాక రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page