![]()
- జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానంపై కేంద్ర మంత్రి రిజిజు వెల్లడి
ఢిల్లీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానంపై 100 మందికిపైగా ఎంపీలు సంతకం చేశారని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
అభిశంసనకు అవసరమైన సంతకాలు పూర్తికావడంతో ఇక ఎప్పుడు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలనే విషయాన్ని బీఏసీ నిర్ణయించనుందని వెల్లడించారు. ఆదివారం దిల్లీలో రిజిజు మీడియాతో మాట్లాడారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ తీర్మానాన్ని తెస్తామని గతంలోనే ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయించే వరకూ తీర్మానంపై తాను ఏ విషయమూ చెప్పలేనని రిజిజు తెలిపారు. జస్టిస్ వర్మను తొలగించే విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని పేర్కొన్నారు. ‘న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది అతి సున్నితమైన, తీవ్రమైన అంశం. ప్రజలకు న్యాయం అందించే వ్యవస్థ కావడంవల్ల దీనికి ప్రాధాన్యం ఉంది. ఒకవేళ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంటే అది ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే అంశమే. అందుకే జస్టిస్ వర్మ తొలగింపు కోసం అన్ని పార్టీలు సంతకాలు చేశాయి’ అని రిజిజు వివరించారు.
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. మంటలను ఆర్పేందుకు వచ్చిన సిబ్బంది వాటిని గుర్తించారు. ఈ ఘటనపై అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా.. అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్ వర్మకు సీజేఐ సూచించారు. ఆయన తిరస్కరించడంతో.. అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు జస్టిస్ సంజీవ్ ఖన్నా లేఖలు రాశారు.


