![]()
మణుగూరు రైల్వే స్టేషన్లో మౌళిక వసతులు కల్పించాలి
- ప్రయాణికులకు రూమ్స్ ఏర్పాటు చేయాలి
- రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభకు హాజరైన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, మన భద్రాద్రి న్యూస్
మణుగూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌళిక వసతులు, రూమ్స్ ఏర్పాటు చేయాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రైల్వే ఏరియా అధికారి రజినిష్ కుమార్ మీనాను కోరారు. మంగళవారం మణుగూరు రైల్వే స్టేషన్ బొగ్గు లోడింగ్ ఏరియాలో రైల్వే అధికారులు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవ వేదికను ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.85 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రైల్వే విభాగాల్లో, అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి కృషి చేస్తూ, నేడు రూ.85 వేల కోట్ల పైచిలుకు ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపనలు, 10 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను, ఇతర రైలు సేవలను జెండా ఊపి ప్రారంభించి భారతదేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పినపాక నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు తెలిపారు. మణుగూరు రైల్వే స్టేషన్లలో మిగిలిపోయిన మౌళిక వసతులను కల్పించి, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రూమ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. పాత రూములను ఆధునీకరించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం దక్షిణ అయోధ్యగా పిలవబడుతుందన్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తరలి వస్తుంటారని, చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం, రాముడు నడియాడిన నేల భద్రాచలం అని, అలాంటి రాముల వారిని దర్శించుకోవాలంటే సరైన రవాణా మార్గం లేక భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే మార్గం నిర్మించాలని గత అనేక సంవత్సరాలుగా డిమాండ్ లో ఉందని గుర్తు చేశారు. దీనిపై కేంద్రం కొంత బడ్జెట్ కేటాయించి సర్వేలు చేసి మధ్యలో నిలుపుదల చేశారని ఆయన తెలిపారు. ఆ ఫైల్స్ ను రైల్వే ఏరియా అధికారులు కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లాలని సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే మేనేజర్ కు పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైన్ నిర్మించాలని మెమోరాండం అందిస్తానని తెలియజేశారు. అనంతరం మణుగూరులో రైల్వే గూడ్స్ షెడ్ నిర్మాణం చేపట్టేందుకు రైల్వే అధికారులతో కలిసి స్విచ్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్.గణేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ లీడర్, ఎంపిటిసి కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు చందా సంతోష్ కుమార్, కాటిబోయిన నాగేశ్వరరావు, పిరినాకి నవీన్, రైల్వే ఏరియా అధికారి రజినిష్ కుమార్ మీనా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రొటేక్షన్ ఫోర్స్ గిరియా, చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జేమ్స్ పాల్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారి ప్రసాద్, టి.వీరన్న, జోక్యం, శిరీష, దండురాణి తదితరులు పాల్గొన్నారు.


