![]()
అరణ్యంలో అక్రమ గుడుంబా దందా..!
– హౌరా మార్కెట్‌ను తలపిస్తున్న స్థావరం.. ఫారెస్ట్ అధికారుల నిఘా ఎక్కడ?
– భారీగా కట్టెల నిల్వలు.. సారా తయారీ సామగ్రి బహిరంగంగా దర్శనం
– అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్, జులై 15
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, మోతెపట్టినగర్ – ఇరవెండి గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో అక్రమ గుడుంబా తయారీ కేంద్రం కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవిలోని నిర్మానుష్య ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని సారా తయారీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తే సాధారణ స్థావరం కాకుండా, హౌరా మార్కెట్‌ను తలపించేలా భారీ స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
*అడవిలోనే భారీ ఏర్పాట్లు*
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అటవీ ప్రాంతంలో తాత్కాలిక గుడిసెలు, పెద్ద సంఖ్యలో నీలిరంగు డ్రమ్ములు, సారా తయారీలో ఉపయోగించే పాత్రలు, రాళ్లతో నిర్మించిన పొయ్యిలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రెండు ట్రాక్టర్లకు సరిపడేంత మేర కట్టెలు నిల్వ ఉంచినట్లు సమాచారం. అడవిలోని చెట్లను నరికి కట్టెలుగా మార్చి సారా తయారీలో వినియోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
*చిన్న తప్పుకే కేసులు.. ఇంత పెద్ద దందా ఎలా?*
అడవిలో సాధారణ ప్రజలు చిన్న అవసరాల కోసం కట్టెలు తీసుకెళ్లినా కేసులు నమోదు చేసే అధికారులు, ఇంత పెద్ద స్థాయిలో చెట్ల నరికివేత, అక్రమ గుడుంబా తయారీ జరుగుతున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
“అడవిలో ఇంత పెద్ద స్థాయిలో ఏర్పాట్లు కనిపిస్తున్నా సంబంధిత అధికారులకు తెలియదా? లేక తెలిసినా పట్టించుకోవడం లేదా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు*
అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టాల్సిన అటవీ శాఖ నిరంతర నిఘా కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ఇంత భారీ స్థాయిలో గుడుంబా తయారీ కేంద్రం ఏర్పడటానికి కారణాలపై సమగ్ర విచారణ జరిపి, దీనికి సహకరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
*కట్టెల నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయి..?*
అడవిలోకి ఇంత సామగ్రి ఎలా చేరింది? ఈ అక్రమ దందా వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
*పైస్థాయి అధికారుల చర్యలపై ఎదురుచూపులు*
అటవీ ప్రాంతంలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టి, అక్రమ గుడుంబా తయారీతో పాటు అడవుల విధ్వంసాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దాడులు నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.








