![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 14:
గుండాల మండలంలోని నర్సాపురం తండాకు చెందిన బోడా నరేష్ నాయక్ భారత నావికాదళంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రత్యేక దళం మార్కోస్ (మెరైన్ కమాండోలు) లో ఎంపికై గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచాడు. చిన్ననాటి నుంచే దేశ రక్షణ రంగంలో సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన నరేష్ నాయక్ ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన అనంతరం ఇండియన్ నేవీలో చేరేందుకు కృషి చేశాడు. ఆన్లైన్ రాత పరీక్షలు, శారీరక దృఢత్వ పరీక్షలు, వైద్య పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్)గా ఎంపికయ్యాడు. అనంతరం కఠినమైన శిక్షణలో ప్రతిభ కనబరిచి భారత నావికాదళంలోని అత్యంత ప్రత్యేకమైన కమాండో దళమైన ఈ మార్కోస్(మెరైన్ కమాండోలు)లో ఎంపిక కావడం విశేషం. మార్కోస్ భారత నావికాదళానికి చెందిన ఉన్నత శ్రేణి ప్రత్యేక కార్యకలాపాల దళం. అధిక ప్రమాదం గల మిషన్లు, ఉభయచర యుద్ధం, ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రత్యేక ఆపరేషన్లలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా నరేష్ నాయక్ మాట్లాడుతూ.. దేశ సేవ చేయడం నా చిరకాల స్వప్నం. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం వల్లనే ఈ స్థాయికి చేరుకోగలిగాను అని తెలిపారు. నరేష్ తల్లిదండ్రులు శ్రీను, సరోజ మాట్లాడుతూ.. తమ కుమారుడు దేశ రక్షణలో భాగం కావడం ఎంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఒడిశాలో నాలుగు నెలల పాటు కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్న నరేష్ నాయక్ త్వరలోనే విధుల్లో చేరనున్నారు. స్థానిక విద్యార్థి ఇలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సాధించడం పట్ల నర్సాపురం తండా గ్రామస్తులు, యువత హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.








