![]()
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్ జులై 13
సోమవారం టేకులపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీదేవి , హౌసింగ్ ఏఈ గణేష్ తో కలిసి మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ స్థితిగతులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.ఇప్పటివరకు ఎన్ని ఇళ్లకు పరిపాలనా అనుమతులు లభించాయి, ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి, ఇంకా ప్రారంభం కాని ఇళ్లకు గల కారణాలు ఏమిటి, నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతి ఎలా ఉందనే అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ, ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే ప్రారంభమైన ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని హౌసింగ్ ఏఈ గణేష్ ని ఆదేశించారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబం సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లబ్ధిదారులు కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.అధికారులు కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.








