![]()
తేదీ : 13-06-2026 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మణుగూరు మండలం
మన భద్రాద్రి న్యూస్
ఏజెన్సీ ప్రాంత షెడ్యూల్డ్ కులాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు.శనివారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొమ్మెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేసింది.ఈ సందర్భంగా బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు కేటాయించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను జనరల్ కేటగిరీలో కలపడం వల్ల షెడ్యూల్డ్ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు.అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్సీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గతంలో మ్యానువల్ పహానీల ఆధారంగా సాగుభూములకు పంట రుణాలు పొందే అవకాశం ఉండేదని, ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన తర్వాత అనేక మంది ఎస్సీ రైతులు పంట రుణాలకు దూరమయ్యారని తెలిపారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఏజెన్సీ ప్రాంత ఎస్సీలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు.వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ ఇనుముల వెంకటేశ్వర్లు, సలిగంటి కొమరయ్య, వల్లపాక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








