![]()
గిరిజన యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
– వృత్తి శిక్షణతో స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్ పిలుపు
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జూలై 15
నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులు ఉన్నత విద్య పూర్తి చేసి ఖాళీగా ఉండకుండా వృత్తి నైపుణ్య శిక్షణలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచించారు.
ప్రపంచ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి యువతి, యువకుడు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. నైపుణ్యాలు ఉంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, కష్టపడి పనిచేసే వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా ఐటీడీఏ భవిత సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ వృత్తి శిక్షణా కార్యక్రమాలను వినియోగించుకుని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏల పరిధిలో గిరిజన యువతకు వివిధ వృత్తి శిక్షణలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. భద్రాచలం, అశ్వరావుపేట, ఇల్లందు, ఖమ్మంలోని శిక్షణా కేంద్రాల్లో ప్రస్తుతం 570 మంది యువతీ, యువకులకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు.
శిక్షణ పొందుతున్న యువత తమ గ్రామాల్లోని ఇతర నిరుద్యోగ గిరిజన యువతను కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని కోరారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, శిక్షణ సామగ్రి అందించడంతో పాటు శిక్షణ పూర్తైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంబ్రాయిడరీ, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన 30 మంది యువతులకు ధ్రువపత్రాలు అందజేశారు. అలాగే తమిళనాడులో ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు నియామక ఉత్తర్వులు, యూనిఫాంలు, శిక్షణ సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్, శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ వీరు నాయక్, హరికృష్ణ, శిక్షణా కేంద్రం ఇన్చార్జి శ్రీనివాస్, శిక్షకులు జ్యోతి, ఎం.డి. అప్రిన్, రజియా బేగం, బాధావత్ సంధ్య, భవిత సెల్ సిబ్బంది సమ్మయ్యతో పాటు గిరిజన యువతీ, యువకులు పాల్గొన్నారు.








