![]()
ట్రాఫిక్ ఉల్లంఘనలపై 33 కేసులు
– ప్రత్యేక తనిఖీల్లో రూ.6,600 జరిమానా
– నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచన
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జూలై 15
భద్రాచలం పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ ఉప నిరీక్షకుడు తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, ముగ్గురు వ్యక్తులతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 33 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, రూ.6,600 జరిమానా విధించారు.
నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, ప్రతి వాహనానికి నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అలాగే ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించరాదని, హెల్మెట్ ధరించి మాత్రమే వాహనాలు నడపాలని అవగాహన కల్పించారు.
వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. మైనర్ బాలలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఉప నిరీక్షకుడు తిరుపతి తెలిపారు. ప్రజల ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.








