![]()
పారదర్శక ఓటరు జాబితాకు సహకరించాలి
– ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు సబ్ కలెక్టర్ సూచనలు
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్
పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారిసబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ కోరారు.
బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్, ఓటరు జాబితా తయారీలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఆయన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమైందని, భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారులు, పర్యవేక్షకులు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారం సమర్పించేలా చూడాలని, ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మృతి చెందిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, రెండు చోట్ల పేర్లు ఉన్న వారి వివరాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖుల వివరాల నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దని, అలా చేయడం నేరంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటి సర్వే జూలై 24 వరకు కొనసాగుతుందని, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారని తెలిపారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించి, సెప్టెంబర్ 28 నాటికి వాటిని పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో భద్రాచలం తహసీల్దార్ రవికుమార్, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.








