![]()
పినపాక పట్టినగర్కు రూ.2.25 కోట్ల అభివృద్ధి వరం
– బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
బూర్గంపాడు, మన భద్రాద్రి న్యూస్, జులై 19
బూర్గంపాడు మండలంలోని పినపాక పట్టినగర్లో రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రూ.2.25 కోట్లతో నిర్మించనున్న ఈ బీటీ రహదారి పూర్తయితే ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో), డీసీసీ జిల్లా అధ్యక్షురాలు, సంబంధిత శాఖల అధికారులు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








