![]()
భద్రాద్రిలో గోదావరి మాతకు వైభవంగా నదీహారతి
- వరదలు తగ్గి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన డీఎస్పీ అరుణ్ కుమార్
భద్రాచలం, ఆగస్టు 2 (మన భద్రాద్రి న్యూస్)
భద్రాచలం పుణ్యక్షేత్రంలోని గోదావరి స్నాన ఘట్టంలో ఆదివారం సాయంత్రం గోదావరి మాతకు నదీహారతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ పాల్గొని గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి వరదలు పూర్తిగా తగ్గి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని గోదావరి మాతను ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులందరికీ గోదావరి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
రామవజ్జల రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పురోహితులు గోదావరి హారతి విశిష్టతను వివరించారు. గణపతి పూజ, దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించి లోకకళ్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ నదీహారతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని తెలిపారు.
అనంతరం శాంతి మంత్ర పఠనం చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన పూజా సామగ్రిని భద్రాచలం రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ అందించింది.
ఈ కార్యక్రమంలో సత్యప్రసాద్ శర్మ, పవన్ కుమార్ శర్మ, రామాచార్యులు, వీరభద్ర శర్మ, సుబ్రహ్మణ్యం ఆచార్యులు, తిరుపతిరావు, ఎన్.ఎస్.ఎన్. రెడ్డి, రామకృష్ణ, తేజ శర్మ, అశోక్ కుమార్, శివ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.








