![]()
- పివైఎల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తాటి రమేష్, కల్తి ప్రమోద్ పిలుపు
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 10:
ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) గుండాల మండల 6వ మహాసభ ఈ నెల 13వ తేదీన మండలంలోని ముత్తాపురం గ్రామంలో నిర్వహించనున్నట్లు పివైఎల్ గుండాల మండల అధ్యక్షుడు తాటి రమేష్, కార్యదర్శి కల్తి ప్రమోద్ తెలిపారు. ఈ మహాసభకు మండలంలోని యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రగతిశీల యువజన సంఘం ఏర్పడి రెండున్నర దశాబ్దాలు పూర్తయ్యాయని, ఈ కాలంలో యువతను సంఘటితం చేస్తూ గుట్కా, మద్యం నిషేధం, నిరుద్యోగ సమస్య పరిష్కారం, విద్యా హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. యువజన ఉద్యమాలను బలోపేతం చేసే క్రమంలో పాలకవర్గాలు, మతోన్మాద శక్తులు, రౌడీ మూకల దాడుల్లో పగడాల వెంకన్న, తుడుం రామన్న, కత్తిరమల్ల పోచన్న, వేములపల్లి కిరణ్ కుమార్, రామదాస్ పున్నయ్య, శంకరన్న తదితరులు అమరులయ్యారని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్ కార్యాచరణను ఈ మహాసభలో రూపొందించుకుని పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా, ఉపాధి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు, యువత హక్కుల సాధన కోసం పోరాటాలను బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ మహాసభకు యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.







