![]()
యూరియా యాప్‌తో రైతులకు ఇబ్బందులు
– సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని శెట్టిపల్లి రైతుల విజ్ఞప్తి
గుండాల మండలం, శెట్టిపల్లి గ్రామ రైతులు యూరియా ఎరువుల బుకింగ్ కోసం అమలు చేస్తున్న యాప్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో మొబైల్ నెట్వర్క్ సరిగా లేకపోవడంతో సిగ్నల్ ఉన్న ప్రాంతాలకు వెళ్లి యూరియాను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో సమయం, డబ్బు వృథా కావడంతో పాటు అనవసర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.
యాప్‌లో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు కనిపించినా, కొద్ది నిమిషాల్లోనే “స్టాక్ లేదు” అని చూపిస్తోందని రైతులు పేర్కొన్నారు. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు.
వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నెట్వర్క్ సమస్యలు ఉన్న గ్రామాలకు ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేయాలని, యాప్‌లోని సాంకేతిక లోపాలను వెంటనే సరిచేసి యూరియా పంపిణీని సులభతరం చేయాలని శెట్టిపల్లి గ్రామ రైతులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.








