![]()
ఎక్సైజ్ ‘మామూళ్ల’ మత్తు.. పల్లెల్లో ‘బెల్టు’ కిక్కు!
సిండికేట్ చేతుల్లో మద్యం దందా.. పర్యవేక్షణ కరువైన ఎక్సైజ్ శాఖ!
గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం.. గుల్లవుతున్న పేదల సంసారాలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): బూర్గంపాడు మండలం లో
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు కేవలం లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే జరగాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ.. అధికార యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకుని వైన్ షాప్ నిర్వాహకులు సృష్టించిన ‘సిండికేట్ రాజ్యం’ పల్లెలను లూటీ చేస్తోంది. ప్రతి పల్లెనూ ఒక బెల్టు షాపుగా మార్చేసి, 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంచుతూ సామాన్యుల రక్తాన్ని తాగుతున్నారు. ఈ దందా అంతా ఎక్సైజ్ అధికారుల ముందే సాగుతున్నా.. వారు ‘మామూళ్ల’ మత్తులో జోగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు కాగితాలకే.. సిండికేట్ దే హవా!
ప్రభుత్వం వైన్ షాపులకు నిర్దేశించిన వేళలు, నిబంధనలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి.
ఒకే మండలం పరిధిలోని వైన్ షాపుల నిర్వాహకులంతా ఒక ‘సిండికేట్’గా ఏర్పడి, ధరలను తమకు నచ్చినట్లు నియంత్రిస్తున్నారు.
అడ్డగోలు ధరలు:
గరిష్ట విక్రయ ధర (MRP) కంటే రూ. 25 నుండి రూ. 35 వరకు అదనంగా వసూలు చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
లిక్కర్ మాఫియా: సిండికేట్ బలాన్ని వాడుకుంటూ, ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం.. చివరకు స్థానిక అధికారులను సైతం ప్రభావితం చేయడం ఈ దందాలో భాగమైంది.
గల్లీ గల్లీకీ ‘బెల్టు’ భాగోతం!
వైన్ షాపుల పరిధి దాటి, ప్రతి కిరాణా కొట్టు, పాన్ డబ్బా, బెల్టు షాపుకు మద్యం బాటిళ్లు చేరిపోతున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేయకూడదనే కఠిన నిబంధన ఉన్నప్పటికీ, సిండికేట్ వ్యాపారులు తమ స్వంత లాభాల కోసం పల్లెల్లో నెట్వర్క్ను విస్తరించారు.
కమీషన్ల ఎర: బెల్టు షాపు నిర్వాహకులకు ప్రత్యేక కమీషన్లు ఇస్తూ, వైన్ షాపుల నుండి రాత్రికి రాత్రే భారీగా మద్యం నిల్వలను తరలిస్తున్నారు
సమయంతో పనిలేదు: ఉదయం ఐదు గంటలైనా, అర్ధరాత్రి ఒంటిగంటైనా బెల్టు షాపుల్లో మద్యం యథేచ్ఛగా దొరుకుతోంది. దీనివల్ల గ్రామీణ యువత, కూలీలు పొద్దున లేచింది మొదలు మద్యానికి బానిసవుతున్నారు.
ఎక్సైజ్ శాఖ..
ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్ (ఆబ్కారీ) శాఖ పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. బెల్టు షాపుల నిర్మూలనపై నిరంతరం సమీక్షలు నిర్వహించాల్సిన అధికారులు, క్షేత్రస్థాయిలో దాడులు చేయాల్సిన సిబ్బంది.. సిండికేట్ ఇచ్చే ‘నెలవారీ ప్యాకేజీల’కు అలవాటు పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ప్రజల ముక్కుసూటి ప్రశ్నలు:
- గ్రామాల్లో వందలాది బెల్టు షాపులు నడుస్తున్నా, ఎక్సైజ్ అధికారుల నిఘా విభాగాలకు ఎందుకు కనిపించడం లేదు?
- ప్రతినెలా వైన్ షాప్ నిర్వాహకుల నుండి అధికారుల స్థాయిని బట్టి అందుతున్న ‘మామూళ్ల’ వాటా ఎంత?
- ఏదైనా గ్రామం నుండి ఫిర్యాదు వస్తే.. ముందే సమాచారాన్ని సిండికేట్ వ్యాపారులకు చేరవేసి ‘డ్రామా’ దాడులు చేస్తోంది నిజం కాదా?
గుల్లవుతున్న పల్లెలు.. రోడ్డున పడుతున్న కుటుంబాలు*
ఈ సిండికేట్, బెల్టు షాపుల దందా వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేద కూలీలు సంపాదించిన డబ్బునంతా ఈ బెల్టు షాపులకే తగలేస్తున్నారు. పల్లెల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. మద్యం మత్తులో జరిగే గొడవలు, రోడ్డు ప్రమాదాలు ఎందరో తల్లుల తాళిబొట్లను తెంచుతున్నాయి
ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, స్థానిక ఎక్సైజ్ సిబ్బందిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం కాగితాల్లో దాడులు చూపించడం కాకుండా:
- గ్రామాల్లోని బెల్టు షాపులను పూర్తిగా రూపుమాపాలి.
- MRP కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్న సిండికేట్ షాపుల లైసెన్సులను రద్దు చేయాలి.
- అక్రమ దందాలకు సహకరిస్తున్న ఎక్సైజ్ అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి.
పల్లెలను పట్టి పీడిస్తున్న ఈ మద్యం మహమ్మారిని, దాని వెనుక ఉన్న సిండికేట్ డ్రామాలను అంతం చేయకపోతే ప్రజాగ్రహం పాలకులకు, అధికారులకు తప్పదనేది అక్షర సత్యం.







