![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పై భారత పార్లమెంటులో చర్చ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పాకిస్థాన్ వైఖరిని అధికార, ప్రతిపక్ష నేతలూ ఎండగట్టారు. దీనిపై పాకిస్థాన్ స్పందించింది. పహల్గాం ఉగ్రదాడి కేసులో సరైన ఆధారాలు, దర్యాప్తు లేకుండా మాట్లాడారని ఆరోపించింది. ఇరుదేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.
”పహల్గాం ఉగ్ర ఘటనపై ధ్రువీకరించదగిన ఆధారాలు, విశ్వసనీయ దర్యాప్తు లేకుండానే పాకిస్థాన్‌పై భారత్ మాటల దాడి చేసింది. నేతల ప్రకటనలు వాస్తవాలను వక్రీకరించేవిగా ఉన్నాయి. మా దేశం ‘అణ్వస్త్ర బెదిరింపుల’కు పాల్పడిందని చెప్పడం తప్పుదోవ పట్టించడమే. అదేవిధంగా సింధూ జలాల ఒప్పందం గురించి తప్పుడు వాదనలు చేశారు. ఒక బాధ్యతాయుతమైన దేశంగా.. శాంతి, ప్రాంతీయ స్థిరత్వం, జమ్మూకశ్మీర్ వివాదం సహా అన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం అర్థవంతమైన చర్చలకు కట్టుబడి ఉన్నాం” అని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకు చర్చల ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేస్తున్నప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం పాత పాటే పాడుతోంది. పహల్గాం దాడి నేపథ్యంలో దాయాదిపై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతోపాటు ఆ దేశంతో ఉన్న వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. నాలుగురోజుల పాటు కొనసాగిన దాడుల అనంతరం దాయాది వేడుకోలుతో కాల్పుల విరమణకు అంగీకరించింది.


