![]()
- ప్రారంభమైన రీవెరిఫికేషన్ ప్రక్రియ
- నియోజకవర్గానికి 3,500 ఇళ్ల మంజూరులో భాగంగా విచారణ
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్:
ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 26 న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 గ్రామపంచాయతీలలో పథకాన్ని ప్రారంభించి, అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు. తొలి విడతలో 72,045 మందికి ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి, ఆయా మండలాల్లోని మిగిలిన గ్రామాల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించానున్నారు. రాష్ట్రంలో అందిన దరఖాస్తుల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేశారు. దరఖాస్తుదారులను ఎల్-1(సొంత స్థలాలు ఉన్నవారు), ఎల్-2(సొంత స్థలం కాని, ఇల్లు కాని లేని వారు), ఎల్-3(ఇతరులు) అని మూడు జాబితాలుగా విభజించారు. ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీవో, గ్రామపంచాయతీ, పురపాలిక పరిధిలో కమిషనర్ల లాగిన్‌కు చేరాయి. ఇలా తొలి విడత పరిశీలన పూర్తవగా ఇప్పుడు ఎల్-1 జాబితాను రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ జాబితాలో 21.93 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 72 వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు వెళ్లి రీవెరిఫెకేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో నిరుపేదలను గుర్తిస్తారు.
ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలు
రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను ఏర్పాటు చేశారు. ఎల్-1 జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్-2, ఎల్-3 లో చేర్చారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. దాంతో ఇలాంటి దరఖాస్తుదారుల వివరాలు సైతం ఎంపీడీవో, కమిషనర్ల లాగిన్‌కు వెళ్లాయి. మండలాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలు ఈ ఫిర్యాదులపై కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నాయి.


