![]()
-టెంటు, త్రాగు నీరు, వైద్య సౌకర్యం కల్పించాలి
ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, మే 31
మండలంలోని స్టేటిపిట్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనులు చేస్తున్న పని ప్రదేశంలో లక్ష్మి అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ వామ పక్ష పార్టీల ప్రోద్బలంతో అప్పటి యూపీఏ -1 ప్రభుత్వం పేద ప్రజల స్థితిగతులను ఆలోచించి ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేయగా ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పనులను విస్మరించి, కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించారని వాపోయారు. తక్షణమే బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచి కూలీకి రోజుకి రూ. 600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎండలు మండుతున్నప్పటికీ కూలీ పని చేసే వారికి కనీస వసతులైన టెంటు, త్రాగు నీరు, వైద్య సౌకర్యం లేవని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామపంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ లేకపోవడం సరైనది కాదని, పని ప్రదేశాలలో నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలు రోజు పనిచేస్తున్నప్పటికీ రోజువారి కూలీ రూ.130 నుండి 150 మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కొలతలకు సంబంధం లేకుండా ప్రభుత్వం కల్పిస్తున్న రోజు కూలి 300 రూపాయలు వర్తింపజేస్తూ, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. లేనిచో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాందాస్, శ్రీదేవి, కుమారి, చిన్నా, నిరోషా, భద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.


