Tuesday, March 24, 2026
HomeTelangana News'కాళేశ్వరం' సర్వే పేరుతో రూ.6.77 కోట్లు వృథా..

‘కాళేశ్వరం’ సర్వే పేరుతో రూ.6.77 కోట్లు వృథా..

Loading

  • రికవరీ చేయాలన్న కమిషన్

మన భద్రాద్రి వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రచ్చ కొనసాగుతూనే ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గత సర్కార్ వ్యాప్కోస్ సంస్థ ద్వారా సర్వే చేయించింది.

అందుకోసం డబ్బులు సైతం చెల్లించింది. కానీ, ఆ సంస్థ ఇచ్చిన నివేదికను మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా డబ్బులు చెల్లించారని కాళేశ్వరం కమిషన్ తన తుది నివేదికలో పేర్కొంది. వ్యాప్కోస్​సంస్థ సర్వేను ప్రత్యేకంగా పరిగణించిన పీసీ ఘోష్ కమిషన్… ప్రజా ధనాన్ని వృథా చేశారని, దీనికి కారణమైన బాధ్యులను గుర్తించి వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని రిపోర్టులో స్పష్టం చేసింది. వ్యాప్కోస్ సంస్థతో సర్వే చేయించాలని అప్పటి సీఎం కేసీఆర్, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్​రావుల నిర్ణయానికి వచ్చారని, అందుకు అనుగుణంగా అధికారులు ఫైల్ మూవ్​ చేసి ఆ సంస్థకు నిధులు విడుదల చేశారని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

  • ఎంత చెల్లించారంటే..

కాళేశ్వరం కమిషన్‌ వ్యాప్కోస్‌కు రూ.6,77,67,000 చెల్లించినట్టు కమిషన్ తుది నివేదికలో పేర్కొంది. వాటిని చెల్లించిన వారి నుంచే డబ్బులు రికవరీ చేయాలని తన నివేదికలో సూచించింది. దీంతో ఇప్పుడు ఎవరి నుంచి ఆ నగదును రికవరీ చేస్తారనే దానిపై నీటిపారుదల శాఖలో చర్చ మొదలైంది. ఈ నిధులను రికవరీ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నా.. ఎవరి నుంచి రికవరీ చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంత డబ్బు చెల్లించే సామర్థ్యం అధికారులకు ఉందా? ఆ నాటి పాలకులు చేసిన తప్పిదాలకు తాము బలి కావాల్సిందేనా? అంటూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎక్కడ నీటి లభ్యత ఉంది, బ్యారేజీల నిర్మాణం, స్థలం తదితర సాంకేతిక విషయాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించడానికి వ్యాప్కోస్‌ను అప్పటి ప్రభుత్వం ఎంచుకుంది. అది​ప్రభుత్వ రంగ సంస్థ. ఎవరికైనా సాంకేతిక సేవలు అవసరముంటే వారు అడిగిన అంశంపై సర్వే చేసి ఇస్తుంది. అందుకు కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. వ్యాప్కోస్..​సర్వేల ద్వారా తన సంస్థకు నిధులను సమకూరుస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థే అయినా, ఇది ఇచ్చే నివేదిక తుది నిర్ణయం కాదు. అధికారికం కాదు. కేవలం ప్రభుత్వ అంచనాకు సాంకేతికంగా ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. ఈ క్రమంలోనే వ్యాప్కోస్ సంస్థ చేసింది ప్రభుత్వ సర్వే కాదని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు.

  • సర్వేను పట్టించుకోకుండానే నిర్మాణం..

ఈ సంస్థ చేసిన సర్వేను సైతం గత పాలకులు వినియోగించుకోకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖరారు చేశారని విచారణలో కాళేశ్వరం కమిషన్ గుర్తించింది. వ్యాప్కోస్ సంస్థ చేసిన సర్వే బుడిదలో పోసిన పన్నీరులా మారిందని వివరించింది. అప్పటి సీఎం కేసీఆర్​అనేక సందర్భాల్లో వ్యాప్కోస్ సంస్థ ద్వారా సర్వే చేయించామని, ప్రభుత్వ సంస్థ అయిన వ్యాస్కోస్ విశ్వసనీయతను దెబ్బతిస్తారా? అంటూ అసెంబ్లీ సహా అనేక సమావేశాల్లో ఆయన ప్రతిపక్షాలపై సీరియస్ అయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి విశ్వసనీయత ఉంటుందని అందరూ నమ్మారు. కానీ, ఆ సంస్థ విశ్వసనీయత, సర్వే రెండింటినీ అనుమానించే విధంగా దానిని సర్కార్ పట్టించుకోలేదని కమిషన్ పేర్కొంది. కమిషన్ నివేదిక ద్వారా అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కాగా, అప్పటి ఫైల్‌పై సంతకం చేసిన వారి నుంచే ఈ మొత్తాన్ని రికవరీ చేస్తారా? లేక సర్వేను ఉపయోగించుకోని వారి(నేతల) నుంచి రికవరి చేస్తారా? అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నిర్ణయాలతో అధికారుల్లో వణుకు మొదలైంది. తాము చేసే ప్రతి పనికి ఫైల్​పై చేసే సంతాకినికి ఒకటి కి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుందని లేకుంటే తామే అధికారికంగా దొరికిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page