Tuesday, March 24, 2026
HomeAndhra Pradeshచెట్టుకు కట్టేసి కొడితే.. డబ్బు తిరిగొస్తుందా..?

చెట్టుకు కట్టేసి కొడితే.. డబ్బు తిరిగొస్తుందా..?

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: భర్త అప్పుచేసి పారిపోతే.. నానా కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటున్న భార్యను చెట్టుకు కట్టి తన పిల్లవాడి ముందే అమానుషంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఈ మధ్యే మనమంతా చూశాం…అయితే భర్త అప్పుచేసి పారిపోతే ఆ భార్యదా నేరం?భర్త తనను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేసి పిల్లల్ని కని ఆ పిల్లల్ని, భార్యను గాలికి వదిలేసి పారిపోయాడు.. ఆమె తల తాకట్టు పెట్టి, ఎముకలు గుల్ల చేసుకొని ఆత్మా భిమానం చంపుకొని పుట్టింటికి చేరి పిల్లల్ని పోషించుకుంటుంది. పిల్లవాడి టీసీ అవసరమై ఊరుకి వచ్చింది. ఆమెను చెట్టుకు కట్టి కొడితే డబ్బు అందుతుందా? ఇచ్చిన వ్యక్తికి అడగాలి.. లేదా పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి.. కానీ అలా చేయకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని స్త్రీ అని కూడా చూడకుండా చెట్టుకు కట్టి కొట్టడం ఎంత అమా నుషం? ఆమె డబ్బు ఏదోలా చేసి ఇస్తాను అన్నా ఆమె మాట వినకుండా కొడుతూనే ఉన్నారు.. ఆమె భర్తపై ఉన్న తమ ఆక్రోశాన్ని ఆమెపై తీర్చుకున్నారు..చిన్న పిల్లవాడి ముందే..చెట్టుకు కట్టేసి కొట్టిన వారు ఎక్కువ వడ్డీ ఆశించి డబ్బు అప్పుగా ఇచ్చినవారు. తీసుకున్న వ్యక్తి తీర్చలేక ఊరు విడిచి పారిపోయాడు.. వాళ్ల డబ్బు తీసుకొని కుటుంబం అంతా ఊరు విడిచి పారిపోయారన్న కోపంతో దుర్మార్గం గా చిన్న పిల్లవాడి ముందు కొడుతుంటే ఆ చిన్న పిల్లవాడు హృదయవిదారకంగా రోదిస్తున్నాడు.. ఆ వీడియో చూసిన ఎవరికైనా గుండె తరుక్కుపోతోంది. డబ్బులు ఇచ్చినప్పుడు ఆమెను అడిగి ఇవ్వాలి.. లేదా కనీసం కుటుంబానికి డబ్బు ఇస్తున్నట్టు తెలియజేయాలి. అలా చేయకుండా ఒక స్త్రీని చెట్టుకు కట్టేసి కొట్టడం అమానుషం.స్త్రీ జీవితం.. ఎటు చూసిన చీకటే!సమాజంలో స్త్రీలకు ఎలాంటి సెక్యూరిటీ లేదు.. పెళ్లి చేసుకుని ఎప్పుడైనా ఆ భార్యని విడిచిపెట్టి వెళ్లిపోవచ్చు, ఎవరూ అడిగే వారు ఉండరు.. ఎంత అప్పు అయినా చేయవచ్చు. ఆ అప్పు ఆమె తల మీద మోపేయవచ్చు, ఎంతమంది పిల్లల బాధ్యత అయినా ఆమెపైనే వేసేయవచ్చు. ఇంకా జీవితమంతా ఆమె ఆ పిల్లల బాధ్యత తన మీద వేసుకొని ఆ పిల్లల్ని తీర్చిదిద్దటానికి తన శరీరాన్ని కొవ్వొత్తిలా కరిగించి శల్యమవ్వాల్సిందే. తను తన ఆశలు, ఆలోచనలు అన్నీ ఆ పిల్లల చుట్టూనే పెట్టుకోవాలి. అటు తల్లిదండ్రులూ, ఇటు అత్తమామలూ అందరూ చేతులు దులుపుకునే వాళ్లే. ఎవరూ మేమున్నామని ధైర్యం చెప్పే వాళ్లూ ఆమెకు ఉండరు. అర్ధం చేసుకునే వాళ్లూ ఉండరు.. ఒకవేళ ఒకటి అరా కుటుంబాలు చేరదీసినా ఇంటికి వచ్చిన మరదళ్లు, వదినలూ రాచి రంపాన పెట్టే వాళ్లూ, చీదరించుకునే వాళ్లూ లేక పోలేదు. ఎటు చూసినా చీకటిమయమే. కనుచూపు మేర ఆసరా కనిపించని బతుకు అలాంటి స్త్రీలది.ఒంటరి స్త్రీ బతుకు దారుణం..ఇదంతా కుటుంబ సమస్య అయితే బయటి ప్రపంచంలో ఒంటరి స్త్రీ అనగానే ఇంకో రకం అరాచకం మొదలవుతుంది. అందరికీ సొంతంలా చుట్టూ ఈగల్లా సానుభూతి పేరుతో సొంగలు కార్చే వాళ్లు కోకొల్లలు.. రాబందుల మధ్య తనని తాను కాపాడుకుంటూ పిల్లల మంచీ చెడూ చూసుకోవాలి.. కాస్త చదువుకొని ఉంటే కనీసం ఆఫీస్‌లో చిన్నపాటి ఉద్యోగం చేయవచ్చు, నలుగురు పిల్లలకు ట్యూషన్లు చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా చదువు లేకపోతే ఇల్లిల్లూ తిరిగి అంట్లు తోముకోవాలి, పాచి పనులు చేయాలి. లేదా మట్టి పని చేయాలి. చీదరింపుల మధ్య జీవితం గడపాలి.. ఎంత బాధాకరమైన జీవితం గడపాల్సి ఉంటుందో వాళ్లని అడిగి చూడండి. ఏ పనీ ఎక్కువా, తక్కువా కాదు. కానీ, మరో దిక్కు లేని పరిస్థితిలోకి ఈ వ్యవస్థ మహిళల జీవితాలను మార్చేయడం అన్యాయం.ఇది సామాజిక సమస్య!ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కోగలిగే వాళ్లు సరే.. మరి మనసు విరక్తి చెంది ఈ జీవితం ఎందుకు అనుకొని అధైర్య పడే స్త్రీలు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న వాళ్ల వార్తలు ఎన్ని పత్రికల్లో చదవం మనం? సహాయం చేయకపోయినా పర్వాలేదు.. కానీ ఇలా చెట్టుకు కట్టేసి కొట్టడం, అవమానించడం ఎంత దారుణం? మనుషుల్ని మన ప్రవర్తన ద్వారా చంపడం చాలా సులువు.. కానీ మనిషిని బతికించుకోవడం చాలా కష్టం. అందులో స్త్రీ అయితే, అదీ అమ్మయితే ఆసరాగా ధైర్యం చెప్పడం ఎంతైనా అవసరం. ఇది ఇంటి సమస్య, అప్పుల సమస్య మాత్రం కాదు.. ఇది సామాజిక సమస్య. హక్కుల సమస్య. అందుకే తక్షణమే నిందితులు అరెస్ట్ కావాలి. అప్పుడే అంబేడ్కర్ ఆశించిన ప్రజాస్వామ్య విలువలకు న్యాయం దొరుకుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page