![]()
- రూపుదిద్దుకుంటోన్న సరికొత్త వెబ్‌సైట్, మొబైల్‌యాప్
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కూర్చున్న చోటు నుంచే.. మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి పౌరసేవలను పొందవచ్చు. సమస్యలపై ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఒక నగరం.. ఒక వెబ్‌సైట్.. ఒక మొబైల్ యాప్ నినాదంతో సరికొత్త డిజిటల్ వేదికను జీహెచ్‌ఎంసీ త్వరలో అందుబాటులోకి తేనుంది. అంతేకాదు.. సదరు వెబ్‌సైట్, మొబైల్‌యాప్‌లో ఫోన్ నంబరుతో లాగిన్ అయితే.. ఆ నంబరుతో అనుసంధానమైన ఆస్తిపన్ను, ఇంటి నిర్మాణ అనుమతులు, జనన ధ్రువీకరణపత్రాలు, ట్రేడ్‌లైసెన్స్, పెంపుడు జంతువుల లైసెన్సు, గుత్తేదారుల కాంట్రాక్టులకు సంబంధించిన సెక్యురిటీ డిపాజిట్లు, క్రీడలకు సంబంధించిన సభ్యత్వాలు, ఇతరత్రా వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. వాటిని అవసరమైనప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల సేవలకు ఆన్‌లైన్ దరఖాస్తులూ అందుబాటులోకి రాబోతున్నాయి. ఫిర్యాదుల పరిష్కారానికి కూడా సమీకృత కంట్రోల్ రూమ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.
- డిజిటల్ పౌరసేవలు..
ఇప్పటికే జనన, మరణ ధ్రువీకరణపత్రాలు, ఆస్తిపన్ను దరఖాస్తులన్నింటినీ డిజిటలీకరణ చేశారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఆయా సేవలకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. మైజీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్‌లోనూ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ అవి పూర్తిస్థాయిలో జనాలకు ఉపయోగపడట్లేదు. పరిమితులు, లోపాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించి, మరిన్ని అదనపు హంగులతో కొత్త వేదికను తీసుకురావాలని కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. ఫోన్ నంబరుతో వినియోగదారులకు ప్రత్యేక ఖాతా ఉండేట్టుగా.. వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, రసీదులు కనిపించేట్టుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఆయన సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)ని ఆదేశించారు.


