Monday, March 23, 2026
HomeAndhra Pradeshటీడీపీలో గవర్నర్ పోస్ట్ చిచ్చు..

టీడీపీలో గవర్నర్ పోస్ట్ చిచ్చు..

Loading

  • అధినేతపై తిరుగుబాటు బావుటా ఎగరేశారా..!

ఏపీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు..! పార్టీ అధికారంలోకి వచ్చి.. ఏడాది దాటినా పదవులు దక్కడం లేదనే లోలోన మదన పడుతున్నారు.

గతంలో ఓ ఇద్దరు నేతలకు గవర్నర్‌ పదవులు ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.. కానీ.. అశోక్ గజపతి రాజుకు మాత్రమే గవర్నర్‌ పోస్టు దక్కింది. దాంతో మరో సీనియర్‌ లీడర్‌ యనమల రామకృష్టుడు తీవ్రంగా రగిలిపోతున్నారట. గవర్నర్‌ పదవి ఇప్పిస్తారని ఆశపడితే.. ఆశలన్నీ అడియాశలయ్యాయని బాధపడుతున్నారట.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ కొలువుదీరి ఏడాది దాటిపోయింది. రాష్టంలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగగానే తమకు పదవులు దక్కుతాయని ఆశపడ్డ సీనియర్‌ నేతలకు సీఎం చంద్రబాబు పక్కన పెట్టేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే కూటమి కోసం కొంత మంది నేతలు తమ సీట్లను త్యాగం చేశారు. వారికి నామినేట్ పోస్టులతో భర్తీ చేస్తారనుకుంటే అందులో కొంత మంది సీనియర్స్ కు నిరాశే ఎదురైంది.

తెలుగు దేశంలో మాజీ కేంద్రమంత్రి ఆశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు లాంటి లీడర్లకు గవర్నర్‌ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏడాది కాలంగా ఈ ఇద్దరు నేతలకు పదవులు రాలేదు. దాంతో ఇప్పట్లో వీరికి పదవులు దక్కడం కష్టమే అన్న చర్చ జరిగింది. కానీ గతంలో హామీ ఇచ్చినట్టుగా ఆశోక్‌ గజపతి రాజును గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ గవర్నర్ గా బాధ్యతలు కూడా స్వీకరించారు. కానీ మరో నేత మాజీమంత్రి యనమల రామకృష్ణుడి పేరు అసలు పరిశీలనలోకే తీసుకోలేదని తెలుస్తోంది. అందుకే ఆయన సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్ గజపతి రాజుతో పాటు మూడు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది. వారందరూ బాధ్యతలు చేపట్టారు. విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు టీడీపీలో సుదీర్ఘంగా కొనసాగారు. ఆయన రాష్ట్రంలో పలు మంత్రి పదవులు నిర్వహించారు. అలాగే 2014లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగానూ పనిచేశారు. రీసెంట్ గా ఆయనను గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజానికి ఇతర పార్టీల నేతలకు గవర్నర్ పదవి కేటాయిచేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంతగా సుముఖత వ్యక్తం చేయదు. కానీ అశోక్ గజపతిరాజు క్లీన్ ఇమేజ్ , చంద్రబాబు ఒత్తిడి కారణంగానే గవర్నర్‌ పదవి ఇచ్చారట.

మరోవైపు మాజీమంత్రి యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి దక్కుతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పదవి లేదు. అందుకే గవర్నర్ పోస్టుపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ సీఎం చంద్రబాబు నిర్ణయంతో యనమల షాక్ అయినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత.. సీనియర్‌ నేతగా మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. 1982 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన పార్టీలో చేరారు. లాయర్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆయన్ను నందమూరి తారకరామారావు తుని నియోజకవర్గం నుంచి ఆహ్వానించారు. దాంతో ఆయన పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఆయన అప్రతిహతంగా ఎదుగుతూ వచ్చారు. గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటివరకు ఎమ్మెల్సీగానూ కొనసాగారు. కానీ ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ పదవి రెన్యూవల్ కాలేదు. ఆ సమయంలో ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో కాస్తా కూల్ అయ్యారు.. కానీ ఇప్పుడు ఆశోక్ గజపతి రాజుకు గవర్నర్‌ పోస్టును కట్టబెట్టి తనను పట్టించుకోకపోవడంతో యనమల తీవ్ర అసంతృప్తికి గురయినట్టు తెలుస్తోంది. అయితే యనమలకు గవర్నర్‌ పదవి దక్కకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో కాకినాడకు సెజ్ విషయంలో యనమల లేఖ రాశారు. అప్పట్లో యనమల రాసిన లేఖ కూటమిలో పెద్ద దుమారం రేపింది. అప్పటినుంచి యనమలను పక్కన పెట్టేశారని సమాచారం. అందుకే ఆయనకు గవర్నర్‌ పదవి అడ్డంకిగా మారిందని అంటున్నారు.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కావడంతో ఆ పార్టీకి చెందిన నేతలెవరికీ ఇప్పటి వరకూ గవర్నర్ పదవులు దక్కలేదు. 2014లో ఎన్డీఏలో భాగంగా టీడీపీ ఉన్నప్పుడు.. మోత్కుపల్లి నర్సింహులుకు చాన్స్ ఇప్పించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ బీజేపీ నేతలు అంగీకరించలేదు. దాంతో మోత్కుపల్లి అసంతృప్తితో చంద్రబాబును ఇష్టం వచ్చిన తిట్టిన తిట్లు తిట్టారు. తర్వాత ఎన్నికల్లో జగన్ కోసం ఏపీలో ప్రచారం చేశారు. ఇప్పించకపోవడమే మంచిది అయిందని తర్వాత టీడీపీ నేతలు అనుకున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కుమార్తెకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఎంపీగా కలిశెట్టి అప్పల్నాయుడుకు మద్దతిచ్చి గెలిపించారు. అందుకే గవర్నర్ పదవి ఇచ్చారనే టాక్‌ వినిపిస్తోంది. మొత్తంగా సీఎం చంద్రబాబు తర్వాత సీనియర్‌ లీడర్‌గా ఉన్న యనమలను హైకమాండ్ పట్టించుకోకపోవడం మాత్రం హాట్‌ టాపిక్‌ అవుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page