Monday, March 23, 2026
HomeSports Newsటెస్టుల్లో ఆడాలని ఉంది.. మాజీ వైస్ కెప్టెన్ ఆవేదన

టెస్టుల్లో ఆడాలని ఉంది.. మాజీ వైస్ కెప్టెన్ ఆవేదన

Loading

మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్:

టీమిండియా మాజీ వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ అజింక్య రహానే భారత టెస్ట్ జట్టు కోసం మళ్లీ ఆడాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. తాను ఈ విషయంపై మాట్లాడడానికి ప్రయత్నించినా సెలక్షన్ కమిటీ నుంచి తనకు ఎటువంటి స్పందన రాలేదని..అయినప్పటికీ తాను ఇష్టపడే టెస్ట్ క్రికెట్ పై నిరంతరం దృష్టి సారిస్తున్నానని రహానే అన్నాడు.37 ఏళ్ల రహానే ఆస్ట్రేలియాతో జరిగిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వెస్టిండీస్ పర్యటన తర్వాత జట్టు నుంచి తొలగించబడిన అజింక్య రహానే.. మళ్లీ స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందు కోసం ముంబై జట్టులో చేరి దేశీయ మ్యాచ్‌లపై దృష్టి సారించాడు.ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లార్డ్స్ మైదానంలో ఉన్న అజింక్య రహానే స్కై స్పోర్ట్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్ పట్ల నాకు చాలా ఆసక్తి ఉంది. నేను నియంత్రించగలిగే విషయాలపై దృష్టి సారించడమే నా పని. నిజం చెప్పాలంటే, భారత జట్టు సెలక్షన్ కమిటీతో మాట్లాడటానికి ప్రయత్నించాను. కానీ ఎటువంటి స్పందన రాలేదు. నేను నిరంతరం ఆడగలను. నాకు టెస్ట్ క్రికెట్ ఇష్టం.” అని అజింక్యా రహానే ఆవేదనతో తెలియజేశాడు.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రహానే జట్టులోకి తిరిగి రావడానికి ఒక చిన్న అవకాశం ఏర్పడింది. అయినప్పటికీ, ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉన్నప్పటికీ, భారత సెలక్షన్ కమిటీ యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించుకుంది. 2020-21 బోర్డర్-గవాస్కరీ ట్రోఫీలో రహానే కెప్టెన్సీ మర్చిపోలేనిది. విరాట్ కోహ్లీ లేని సమయంలో భారత జట్టును నడిపించి మెల్బోర్న్, గాబా టెస్ట్ మ్యాచ్‌లలో చారిత్రాత్మక విజయాలను అందించారు. ఆ సిరీస్‌లో 268 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.2013లో అరంగేట్రం చేసిన రహానే, ఇప్పటివరకు 85 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడి 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలతో 5077 పరుగులు సాధించాడు. గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే.. 11 ఇన్నింగ్స్‌లలో 214 పరుగులు చేశాడు. అజింక్యా రహానే నాయకత్వంలోని ముంబై జట్టు, 2023-24 రంజీ ట్రోఫీలో కప్‌ను గెలుచుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page