Tuesday, March 24, 2026
HomeTelangana Newsతెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్

తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్

Loading

తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్

  • వికారాబాద్ జిల్లా దామగూడెంలో ఏర్పాటుకు రంగం సిద్ధం

సముద్రం, నౌకాశ్రయాలు ఏవీ లేకపోయినా కీలకమైన రాడార్ స్టేషన్‌కు తెలంగాణను కీలకమైన ప్రాంతంగా నేవీ శాఖ ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పాలని భావించింది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికాదళం వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌గా వాడుకోవాలని అనుకుంటోంది. ఇందుకోసం వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. అక్కడే ఆ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలో మొదటిది తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్‌గా 1990 నుంచి పని చేస్తుండగా రెండో స్టేషన్‌కు దామగూడెం అనువైన ప్రాంతంగా విశాఖపట్నం లోని తూర్పు నౌకాదళ కమాండ్ గుర్తించింది. ఈ స్టేషన్‌ను ఇక్కడ నెలకొల్పడానికి దాదాపు 15 ఏళ్లుగా (2010 నుంచి) నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, ఇతర క్లియరెన్స్‌లు వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఇది గాడిన పడలేదు. భూముల కేటాయింపులో ఆశించిన పురోగతి లేకపోవడంతో పెండింగ్‌లో పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను తొలగించారు. కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం సీఎంను సచివాలయంలో కలిసి దీని ఏర్పాటుపై చర్చించారు. వికారాబాద్ డీఎఫ్వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి ప్రభుత్వం అప్పగించింది. నేవీ ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2014లోనే ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూ సంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు మరో రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ కోర్టులో దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉన్నందున భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని, అనుమతులపై ఆంక్షలు పెట్టబోమని నేవీ స్పష్టత ఇచ్చింది. నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్‌లో దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులు ఉంటారు. దాదాపు మూడు వేల మంది ఈ టౌన్‌షిప్‌లో నివసించనున్నారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు నేవీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్ల నిర్మాణం జరగనుంది. నేవీ ప్రతిపాదనల ప్రకారం ఇప్పటి నుంచి పనులు మొదలుపెడితే మూడేళ్ల తరువాత (2027లో) కొత్త వీఎల్ఎఫ్ స్టేషన్ ఫంక్షనింగ్‌ లోకి రానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page