![]()
-తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఆసక్తి
హైదరాబాద్, మన భద్రాద్రి స్టేట్ బ్యూరో, జులై 06
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ అనగానే రెండు రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది విశ్లేషకులు తమవైపు నుంచి భారీగా సలహాలూ, సూచనలూ ఇచ్చారు. ఇదివరకు లేని డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. దాంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో జరిగే భేటీలో సానుకూల స్పందనలు ఎంతవరకూ వస్తాయనేది చర్చగా మారింది. ఐతే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మంచి సఖ్యత ఉంది కాబట్టి ఇవాళ్టి భేటీలో కొంతవరకూ సానుకూలత ఉంటే ఉండొచ్చుగానీ, పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైనా పాజిటివ్ అవుట్‌పుట్ వస్తుందనే గ్యారెంటీ లేదు.
చర్చకు వచ్చే అంశాలు ఇవే:
ఇవాళ భేటీలో సీఎంలతోపాటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్‌లు, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొంటున్నారు. ప్రధాన అజెండాగా విభజన సమస్యలపై చర్చ ఉండబోతోంది. అలాగే విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని ఆర్టీసీ, ఆర్థిక సంఘం, తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్శిటీ, ఉన్నత విద్యామండలి వంటి 30 సంస్థల స్థిర, ఛర ఆస్తులపై చర్చ జరగనుంది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ, విద్యుత్ సంస్థల బకాయిలు (రూ.24 వేల కోట్లు ఏపీ నుంచి రావాల్సి ఉండగా తెలంగాణ నుంచి రూ.7 వేల కోట్లు రావాలని ఏపీ అంటోంది.), రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల బదిలీల అంశాలపై కూడా చర్చ సాగనుంది. ఇక ఏపీలో కలిపిన భద్రాచలంలోని ఐదు గ్రామాలైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, పిచుకులపాడు, కన్నాయిగూడెం గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలనే అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే ఈ భేటీ రాత్రి 10 గంటల వరకూ జరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
న్యాయం జరిగేనా?
ఇవాళ్టి భేటీ ఎంతవరకూ ఫలితం ఉంటుందనేది చర్చగా మారింది. రెండు రాష్ట్రాల సీఎంలూ తమ తమ రాష్ట్రాలకు అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటారు. ఏపీ నిర్ణయాలు తెలంగాణకు సమస్య కాగలవు, అలాగే తెలంగాణ నిర్ణయాలు ఏపీకి సమస్య కాగలవు. అలాంటప్పుడు ఈ భేటీ ఫలితం ఎలా ఉంటుందో అనే చర్చ సాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం రెండు రాష్ట్రాలకూ సమన్యాయం జరిగేలా చేస్తామని అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ భేటీపై సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. నీటి పంచాయతీ, గ్రామాల విలీనం, విద్యుత్ బకాయిలు ఈ మూడు అంశాలూ అత్యంత పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఏళ్లుగా వీటికి పరిష్కారం లభించట్లేదు. గత ప్రభుత్వాలు కూడా పదేళ్లుగా వీటికి ఆన్సర్ ఇవ్వలేకపోయాయి. ఇవాళ్టి సమావేశంలోనూ ఈ అంశాలపై లోతుగా వెళ్లకుండా మిగతా సమస్యలను వెంటనే పరిష్కరించగలిగే అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉందనీ, తద్వారా నేటి భేటీలో వచ్చే అవుట్‌పుట్ ఆధారంగా భవిష్యత్‌లో మళ్లీ భేటీ పెట్టుకొని లోతైన అంశాలపై అప్పుడు చర్చిస్తారనే వాదన ఉంది. అందువల్ల ఇవాళ్టి భేటీలో మంచి ఫలితం రావాలని అందరూ ఆశిస్తున్నారు.


