![]()
- టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వార్నింగ్
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
ఆన్ లైన్, సైబర్, డిజిటల్ మోసాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే సీనియర్ ఐపీఎస్, టీజీ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ ఈ సారి ఫేక్ ఫోన్ పే యాప్ లతో జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. నకిలీ యాప్ లతో నగదు బదిలీ చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో ఇలాంటి వందలాది వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.
కొంత డబ్బు చెల్లిస్తే ఫేక్ ఫోన్ పే యాప్ లింక్ పంపిస్తామంటూ మాయమాటలు చెప్పి కొందరు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అచ్చం ఫోన్ పే యాప్ లాగానే ఫేక్ యాప్స్ పనిచేస్తున్నాయని, ఈ ఉత్తుత్తి యాప్ లతో చిరు వ్యాపారులు, అమాయక ప్రజలను కేటుగాళ్ళు మోసం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఫేక్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండండని, ఏపీకే ఫైల్స్ ని డౌన్ లోడ్ చేసుకోకండని హెచ్చరించారు. డౌన్ లోడ్ చేసుకునే ముందు యాప్ను వెరిఫై చేసుకోండని.. మీరు సరైన దానినే డౌన్లోడ్ చేసుకున్నారా అని సరి చూసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ను పరిశీలించాలని సూచించారు.
ఒక మోసపూరిత యాప్ను డౌన్లోడ్ చేసి ఉండొచ్చని భావిస్తే, ఆ యాప్ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండని తెలిపారు. నకిలీ యాప్లు మీ డేటాకు తీవ్ర హాని కలిగిస్తాయని.. అప్రమత్తంగా ఉండడం ద్వారా ఇలాంటి హానికరమైన యాప్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.


