![]()
- ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా, అర్ద్రరాత్రి పలు జిల్లాల్లో కుండపోత వాన కురిసింది.
బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఏపీలో బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
అర్ద్రరాత్రి గుంటూరు, ఎన్టీఆర్, క్రిష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. కాగా, రేపు (గురువారం) ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ మూడు రోజులు అవసరమైతేతప్ప బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
ప్రభుత్వం ఇప్పటికే భారీ వర్షాల వేళ అప్రమత్తం అయింది. అధికారులకు కీలక సూచనలు చేసింది. సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని సూచించారు. రెవిన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.


