![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 30
కోయగూడెం ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ కార్మికులకు స్కిల్డ్ వేతనాలు, కనీస సౌకర్యాలైన పిఎఫ్ లెక్కలు, రెండు జతల యూనిఫామ్స్, హస్పిటల్ సౌకర్యం కల్పించాలని ఏఐటీయూసీ ఆద్వర్యంలో గురువారం ఎల్ఎస్ఎన్ యాజమాన్యం ఇంఛార్జి రాజ్ మోహన్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఏఐటీయూసీ మండల సహయ కార్యదర్శి ఐతా శ్రీరాములు మాట్లాడుతూ ఎల్ఎస్ఎన్ యాజమాన్యం చెల్లిస్తున్న ఆన్ స్కిల్డ్ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆరోపించారు. కోల్ ఇండియా కార్మికులకు రోజుకి రూ.1199, నెలకు రూ. 31,174 చెల్లిస్తుందని, అదేవిధంగా సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కార్మికులకు కోల్ ఇండియా తరహా వేతనాలు చెల్లించి, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతీ కార్మికుడికి బ్లాస్టింగ్ కోడ్ ప్రకారం రెండు జతలు దుస్తులు ఇవ్వాలని, అవి కూడా ఎర్ర రంగు సంబంధించినవే ఉండాలన్నారు. గతంలో ఇదే ఓసీలో అనేక కంపెనీలు అందించాయని గుర్తు చేశారు. ఎల్ఎస్ఎన్ యాజమాన్యం వెంటనే స్పందించి డిమాండ్లు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల సమ్మె చేయడానికి వెనకాడేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ, సమ్మయ్య, రమేష్, నర్సింహారావు, భద్ర, సక్రూ, చారి, రామయ్య, మంగిలాల్, సెట్టియా, లాల్ సింగ్, బాబులాల్, మాన్ సింగ్, లక్ష్మయ్య, మోహన్, కిషన్, హస్సరామ్,వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.


