![]()
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ
- తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ మృతి
- ఛత్తీస్గడ్ పూజారి కాంకేర్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన దామోదర్
- లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
చర్ల, మన భద్రాద్రి న్యూస్
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈనెల 16న (గురువారం ) చత్తీస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, పూజారి కాంకేర్, మారేడు బాకా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ తో పాటు 17 మంది మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ శనివారం లేఖను విడుదల చేసింది. చొక్కా రావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతని పై చత్తీస్గడ్ రాష్ట్రంలో 50 లక్షలు, తెలంగాణలో 25 లక్షల రివార్డు ఉంది. దామోదర్ స్వస్థలం ములుగు జిల్లా, కాల్వపల్లి. 30 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పని చేసిన దామోదర్ ఆరు నెలల క్రితం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. దామోదర్ మావోయిస్టు యాక్షన్ టీమ్ లకు ఇన్చార్జ్ గా కూడా వ్యవహరించారు. మావోయిస్టు పార్టీ పేరిట విడుదల చేసిన లేఖలో రాష్ట్రం, కేంద్రంలో భద్రతా దళాలు బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్ ప్రాంతంలో ఆపరేషన్ పేరుతో క్రూరమైన అమానవీయ, అణిచివేత ప్రచారం ప్రారంభించాయి. పెట్టుబడిదారీ రాజ్యాధికారం ఆదేశానుసారం బస్తర్ లోని సహజ వనరులను దోచుకోవడం, గిరిజనులను వారి భూములు మరియు అడవుల నుండి నిర్మూలించడం ఈ ప్రచారం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ ఆపరేషన్ లో మా సంస్థ 18 మంది వీర సహచరులను కోల్పోయింది. ఈ వీరులు తమ చివరి శ్వాస వరకు పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా కామ్రేడ్ బడే చొక్కా రావు ( దామోదర్ దాదా ) ధైర్య సాహసాలను ప్రదర్శించి పోరాడుతూ అమరుడయ్యాడు. అతని మరణం సంస్థకు కోలుకోలేని నష్టాన్ని కలిగించింది. హంగి పిపిసిఎం, దేవే పిపిసిఎం, జోగా పిపిసిఎం, నరసింహారావు పిపిసిఎం మరియు సిపిఐ మావోయిస్టులోని ఇతర కామ్రేడ్లకు లాంగ్ లీవ్ అంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే దామోదర్ అతని విప్లవాత్మక వారసత్వం వేలాది మంది కొత్త సహచరులకు స్ఫూర్తినిస్తుంది అంటూ మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.


