![]()
మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో పోలీసుల మెగా వైద్య శిభిరం
-వైద్య శిభిరంలో పరీక్షలు చేయించుకున్న 150 గిరిజన కుటుంబాలు
చర్ల, మన భద్రాద్రి న్యూస్
తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మండల పరిధిలోని చెన్నాపురం అటవీ గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్ల సీఐ ఏ రాజవర్మ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడి గిరిజనులకు సరైన వసతులు లేక నేటికీ వెనకబడి ఉన్నారు. పుట్టిన పసిపాప నుండి పండు ముసలి వరకు అనారోగ్యం చేస్తే ఆకు పసరు మింగే పరిస్థితి. లేదా పూజారి వద్దకు వెళ్లి ఆరోగ్య సమస్యలపై అడిగి తెలుసుకునే పరిస్థితి నేటికీ అక్కడ కనబడుతుంది. అలాంటి మారుమూల గ్రామాల గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో చర్ల పోలీసులు చెన్నాపురం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ శిభిరంలో అన్ని విభాగాలలో నిపుణులైన వైద్యుల బృందంచే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిభిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు. వైద్య శిభిరంలో బత్తినపల్లి, బట్టి గూడెం, కుర్నపల్లి తదితర గ్రామాలకు చెందిన 150 కుటుంబాల గిరిజనులు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిభిరంలో సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ దివ్యనయన, చర్ల ప్రభుత్వ వైద్యులు సాయి వర్ధన్, ప్రముఖ పీడియాట్రిషన్ ఏహెచ్ భద్రాచలం డాక్టర్ విజయరావు, భద్రాచలం సురక్ష హాస్పిటల్ ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్రీకాంతి, సురక్ష హాస్పిటల్ ప్రముఖ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ వైద్యులు అక్కినేని లోకేష్ లు గిరిజనులను పరీక్షించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గుత్తి కోయ గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

చెన్నాపురం తదితర పరిసర గ్రామాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి, నిధులు కేటాయించినా మావోయిస్టులు అడ్డుకోవడంతో నేటికీ కొన్ని గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందలేదని అన్నారు. ఇప్పటికైనా గిరిజనులు మేల్కొని అటువంటి వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకే జిల్లా పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. గిరిజన గ్రామాల ప్రజల సౌకర్యార్థం కోటి రూపాయల వ్యయంతో చెన్నాపురం పోలీస్ క్యాంప్ పక్కన మొబైల్ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోని, ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు, వైద్య శిభిరంలో పాల్గొన్న పిల్లలకు బట్టలు, బిస్కెట్లను అందజేశారు. పోలీస్ అధికారుల పర్యటన భాగంగా చర్ల సీఐ ఏ రాజవర్మ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఏఎస్పీ మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, ప్రజల రక్షణే పోలీసుల ధ్యేయమని, అత్యవసర పరిస్థితులలో అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. చిన్నపాటి సమాచారం ఇచ్చినా చాలు ఆగమేఘాల మీద వచ్చి పోలీసులు సహాయం అందిస్తారని ఏఎస్పి అంకిత్ కుమార్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే యువత చదువులో రాణించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, కష్టపడి చదివి ఉద్యోగ అవకాశాలు పొందాలని. యువతకు ఎలాంటి సహకారం అందించటానికైనా తాము సిద్ధమని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తమ గ్రామాల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చిన్నాపురం గ్రామంలో పెద్ద ఎత్తున మెగా వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసిన చర్ల పోలీసులను గిరిజన గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చర్ల సీఐ ఏ రాజవర్మ, ఎస్సై ఆర్ నర్సిరెడ్డి, పోలీస్, వైద్య సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


