![]()
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-ఎస్సై రాజేష్
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
మండలంలో భారీ వర్షాల కారణంగా గోదావరి వరదల నేపథ్యంలో బూర్గంపహాడ్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం ఎస్సై రాజేష్ కోరారు. మండల వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాలలో మండల కేంద్రంలోని అంబేద్కర్ ఎస్సీ కాలనీ, నాగినేని ప్రోలు లోతట్టు ప్రాంతాలు, సారపాకలోని మసీద్ ఏరియా, సుందరయ్య నగర్ ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో సుమారు 14 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయిందని, సమీపంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, గోదావరి వరద కూడా వేగంగా పెరుగుతూ రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి ఈ రాత్రికి లేదా రేపు ఉదయం చేరే అవకాశం ఉండొచ్చని ఆయన తెలిపారు.
అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి ఎవరూ బయటకు రావద్దని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, గోదావరి వరదను చూసేందుకు రావద్దని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు, వరద ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు అవసరమైతే పునరావస కేంద్రాలకు తరలిరావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.


