![]()
వాహనదారులకు పలు జాగ్రత్తలు తెలిపిన ట్రాఫిక్ ఎస్సై నరేష్
కొత్తగూడెం, మన భద్రాద్రి స్టాఫ్ రిపోర్టర్
పట్టణంలోని వాహనదారులకు ట్రాఫిక్ ఎస్సై కే నరేష్ వర్షాకాలంలో వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆదివారం తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ బైక్ పాత టైర్లు అరిగిపోయినట్లయితే వెంటనే టైర్లను మార్పించుకోవాలని, అలా చేయని యెడల పంక్చర్లు అవుతాయని, వర్షంలో వెళ్లేటప్పుడు పాత టైర్లు పట్టును కోల్పోయి అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అందుకే పాత టైర్లను మార్చుకొని కొత్త టైర్లు వేయించుకోవడం మంచిదని సూచించారు. అలాగే ఇండికేటర్ పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలని, వాహనాలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే సరిచేయించుకోవాలని కోరారు.
వర్షం కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవని, హెడ్ లైట్, టెయిల్ లైట్లు పనిచేయకపోతే ఇలాంటి సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని తెలిపారు. వాహన బ్రేకులను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలని, ఒక్కోసారి బ్రేకులు బిగుసుకుపోయి వాహనం సమయానికి ఆగదని అన్నారు. వర్షాకాలంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, రోడ్లపై నీరు నిలిచి తడిగా ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, హెల్మెట్ ఉంటే ప్రమాద తీవ్రత తగ్గుతుందని, చిన్న గాయాలతో బయటపడవచ్చని తెలిపారు. ఒక్క వాహనాలకు మాత్రమే ఈ జాగ్రత్తలు కాకుండా వాహనదారులు కూడా జాగ్రత్తలు పాటించడం మంచిదని, ప్రమాదం జరగకుండా మనమే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులందరికీ ఈ సందర్భంగా ఆయన తగు జాగ్రత్తలు తెలియజేశారు.


