Monday, March 23, 2026
HomeTelangana Newsసజీవ సమాధి అవుతా.. పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే - మాజీ డీఎస్పీ నళిని

సజీవ సమాధి అవుతా.. పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే – మాజీ డీఎస్పీ నళిని

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: మాజీ డీఎస్పీ దోమకొండ నళిని ఆచార్య సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ఈరోజు ( సెప్టెంబర్ 26, 2025 ) తెల్లవారుజామున నాలుగు గంటలకు తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా “మరణ వాంగ్మూలం” పేరుతో ఒక లేఖను విడుదల చేశారు.

ఆ లేఖలో తన ఆరోగ్య పరిస్థితి, గతంలో ఎదుర్కొన్న పరిస్థితులు సహాయ ప్రస్తుతం అనారోగ్యం గురించి రాసుకొచ్చారు. అలాగే నవమి నాటికి తన విషయం ఎటు తేలకపోతే సజీవ సమాధి అవుతానని.. అందుకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే ఆరోపించారు. దీంతో ఈ లేఖ వ్యవహారం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

  • వ్యాధి తీవ్రతపై వివరణ..

ఆ లేఖలో.. నళిని తనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందని తెలిపారు. ఈ వ్యాధి రక్తం, ఎముకల క్యాన్సర్‌తో సమానమని.. తనలోని తెల్ల రక్తకణాలు అస్థికణాలపై దాడి చేసి RA ఫ్యాక్టర్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అది రక్తంలో ప్రవహిస్తూ గుండె, లివర్, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాలను దెబ్బతీస్తోందని చెప్పారు. సాధారణంగా అల్లోపతి చికిత్సలో స్టెరాయిడ్స్ వాడతారని, కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కాళ్లు, చేతులు వంకరలు పోతాయని వివరించారు. అందుకే తాను అలాంటి మందుల బదులుగా ఆయుర్వేదం, పంచకర్మ, యోగ, యజ్ఞం వంటి పద్ధతులను ఎంచుకున్నానని, దాంతోనే గత ఎనిమిదేళ్లుగా తన శరీరంలో అంగవైకల్యం రాకుండా కాపాడుకోగలిగానని ఆమె స్పష్టం చేశారు.

  • కాంగ్రెస్ పాలనపై ఆరోపణలు..

తన వ్యాధి తీవ్రమవ్వడానికి అసలు కారణం నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని నళిని ఆరోపించారు. రాష్ట్రపతి మెడల్ లక్ష్యంగా డైనమిక్ ఆఫీసర్‌గా పనిచేసిన తనను సస్పెండ్ చేసి.. వెంటాడి వేటాడటం వల్లనే తన శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని వాపోయారు. ఫిజికల్, ఎమోషనల్ స్ట్రెస్ కారణంగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరింత ప్రమాదకర స్థితికి చేరుకుందని తెలిపారు.

  • రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం..

కాగా నళిని తన ప్రస్తుత దుస్థితికి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలంటూ ఆరోపించారు. ఇరవై ఒకటిన్నర నెలల క్రితం తాను సమర్పించిన రిపోర్ట్‌పై ఇప్పటివరకు సీఎం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. ఆ రిపోర్ట్ మొదట సీఎంనుంచి చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వద్దకు, అక్కడినుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి వద్దకు, ఆపై ఓఎస్‌డీ వేముల శ్రీనివాస్ చేతుల్లోకి, చివరికి తనకే బ్యాచ్‌మేట్ అయిన కలెక్టర్ హనుమంత రావు దగ్గరకు చేరిందని వివరించారు. ఈ విధంగా ఫైల్‌ను తక్కువస్థాయి అధికారుల వద్దకు వదిలేయడం ద్వారా తన స్థాయిని తగ్గించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

  • ప్రభుత్వ తీరుపై ఆవేదన..

తన మరణ వాంగ్మూలాన్ని కలెక్టర్‌తో రికార్డు చేయించడం మినహా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నళిని విమర్శించారు. సంధ్యా థియేటర్‌లో తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం వారం రోజుల్లోనే సహాయం అందించిందని.. కానీ తన విషయంలో మాత్రం సంవత్సరాల తరబడి కావాలని తాత్సారం చేస్తోందని వాపోయారు. తన చెవులతో ముఖ్యమంత్రి స్వయంగా స్టేట్‌మెంట్ వినాలని, లేకుంటే బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితికి చేరుకుంటానని పేర్కొన్నారు.

  • సజీవ సమాధి హెచ్చరిక..

నవమి నాటికి తన సమస్యకు పరిష్కారం రాకపోతే తాను సజీవ సమాధి అవుతానని నళిని స్పష్టంగా హెచ్చరించారు. తాను ఏ రీతిలో మరణించినా అది ప్రభుత్వ హత్యగానే పరిగణించబడాలని, దానికి తన ఫేస్‌బుక్ పోస్టులే సాక్ష్యమని పేర్కొన్నారు. తనను ఇష్టపడే అభిమానులు తనను ఆనందంతో ఈ లోకం నుంచి సాగనంపాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page