![]()
-సీఎండీ ఎన్ బలరాం స్పష్టీకరణ
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో, ఫిబ్రవరి 17
సింగరేణీ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల జీఎంలు, 39 గనులకు సంబంధించిన ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో సోమవారం సంస్థ సీఎండీ ఎన్ బలరాం తొలిసారిగా సింగరేణీ భవన్ లో ఒక్కొక్క ఏరియా జీఎంతో ముఖాముఖి సమీక్షా నిర్వహించారు. సింగరేణీ కాలరీస్ సుస్థిర భవిష్యత్తే ప్రతీ ఒక్క అధికారి, ఉద్యోగికి ప్రథమ కర్తవ్యం కావాలని ఇందుకోసం అందరూ తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని, అలసత్వం ప్రదర్శించే వాళ్లకు కంపెనీలో స్థానం ఉండదని ఆయన స్పష్టం చేశారు. పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి వీలుగా సంస్థ భవిష్యత్తు కోసం వచ్చే పదేళ్లకు అవసరమైన ప్రణాళికలను ప్రతీ విభాగం అధిపతులు సిద్ధం చేయాలని ఆదేశించారు. సింగరేణీలో పని చేస్తున్న అందరికీ కంపెనీ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పునరుద్ఘాటించారు. ఇందులో ఆయా ఏరియాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలుసుకొని రానున్న 43 రోజుల్లో మిగిలిన లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సాధించాలని ఆదేశించారు. రోజుకు 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలన్నారు. అలాగే 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని స్పష్టం చేశారు. బొగ్గు ఉత్పత్తిలో రక్షణ, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో రవాణా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బొగ్గు రవాణా సాఫీగా జరిగేలా రైల్వే, వినియోగదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలని సూచించారు. నూతన గనుల విషయంలో అపరిష్కృతంగా ఉన్న భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత కార్పోరేట్ జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల తాను బెల్లంపల్లి, రామగుండం రీజియన్లలోని 20 గనుల పర్యటనలో కార్మికుల నుంచి తెలుసుకున్న సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్షేత్ర స్థాయిలో పరిష్కారం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల్లో నైపుణ్యాల పెంపుదల, గనుల్లో మ్యాన్ రైడింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం, మౌళిక సదుపాయాల కల్పన తదితర అన్ని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు.
సంస్థ నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కార్పోరేట్ జీఎంలు తోడ్పాటు అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ, నాణ్యత పెంపుదలతోపాటు భూ గర్భ గనులకు సంబంధించి టబ్బులను అందుబాటులో ఉంచేలా చూడటం, ప్రాసెస్డ్ ఓవర్ బర్డెన్ నిల్వలను ఉంచుకోవడం, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, గైర్హాజరీలను నివారించేలా కౌన్సిలింగ్ నిర్వహించడం తదితర అన్ని చర్యలను చేపట్టడం ద్వారా ఉత్పత్తికి దోహదపడవచ్చన్నారు.
ప్రతీ ఉద్యోగి, అధికారి ఒక జట్టుగా పనిచేస్తూ సంస్థను అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఉద్యోగులు, అధికారులు ప్రతీ ఒక్కరూ రోజుకు ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా పనిచేస్తూ, తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. మస్టర్ పడి బయటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతీ ఉద్యోగి విధులకు సకాలంలో వచ్చేలా చూడాలని, గ్రేస్ టైమ్ వరకు మస్టర్ నమోదుకు అనుమతించొద్దన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ పనిచేస్తున్నామా లేదా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్లు డి సత్యనారాయణ(ఈఅండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె వేంకటేశ్వర్లు (పీఅండ్ పీ), అడ్వైజర్(ఫారెస్ట్రీ) మోహన్ పర్గేన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డీఎం సుభానీ, జీఎం(సీపీపీ) మనోహర్, జీఎం(మార్కెటింగ్) డి రవి ప్రసాద్, అన్ని ఏరియాల జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లు, తదితరులు పాల్గొన్నారు.


