![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్
బంజారా గిరిజనులు ఎంతో పవిత్రంగా జరుపుకునే సీత్లా భవాని (దాటుడు) పండుగను వేరువేరు తేదీల్లో కాకుండా అందరం ఒకేసారి ఈ రోజు మంగళవారం జరుపుకుని జాతి ఐక్యతను చాటుదామని సోమవారం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టేకులపల్లి దాసుతండా ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ప్రకృతిని పూజించడం, ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకతని, గిరిజనుల కట్టు, బొట్టు, వేశధారణ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అతి పవిత్రమైనవని అన్నారు. పండుగ సందర్భంగా పశువులను అలంకరించడం గిరిజన జాతి పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తుందన్నారు. ఏడుగురు అమ్మవార్లు కాళీకమాత, తులజ భవాని, మేరమ్మ యాడి (జగదాంబమాత), సీతమ్మ మాత, మంత్రాల్ మాత, హింగ్లాజ్ మాత, ద్వాల్ ఆంగల్ యాడిలను కొలువు దీర్చే ప్రజలు వంట పైర్లు, పశుసంపద ఆరోగ్యంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆషాడమాసం శుక్లపక్షం మొదటి లేదా రెండవ మంగళవారం గిరిజన జాతి శోభ ఉట్టిపడేలా సీత్లా పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ మాసంలో వచ్చే నాలుగవ మంగళ వారం వేరేవేరుగా దాటుడు పండుగ జరుపుకుంటున్నారన్నారు. అయితే అలాకాకుండా ఇక నుంచి లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా నిలిచే సీత్లా భవాని పండుగను ఈ రోజు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులంతా జరుపుకుని జాతి ఐక్యతను చాటాలని హరిప్రియ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల గిరిజన సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


